ఉత్తర కొరియా మరో ధిక్కారం
♦ బాలిస్టిక్ మిస్సైల్ సాంకేతికతతో ఉపగ్రహ ప్రయోగం
♦ శాంతియుత అంతరిక్ష ప్రయోగమని సమర్థన
అది బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగమంటున్న అమెరికా, ద. కొరియా
♦ తక్షణ ఆంక్షలకు అంతర్జాతీయ సమాజం డిమాండ్; ఐరాస అత్యవసర భేటీ
సియోల్: అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను ధిక్కరించి నెల క్రితం అణు పరీక్ష జరిపిన ఉత్తర కొరియా.. ఆదివారం మరో దుస్సాహసానికి పాల్పడింది. ఒక ఉపగ్రహాన్ని బాలిస్టిక్ మిస్సైల్ సాంకేతికతతో లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టామని ప్రకటించింది. అయితే, అది బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అని, అమెరికాపై క్షిపణి దాడికి ఉపయోగపడగల ఆయుధ ప్రయోగ పరీక్ష అని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసరంగా భేటీ అయింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఉత్తర కొరియాపై ఆంక్షల తక్షణ విధింపుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఉత్తర కొరియా చర్యను ఐరాస, నాటో సహా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ పరీక్ష ఐరాస తీర్మానాల ఉల్లంఘన అని, తక్షణమే ఆంక్షల విధింపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే, ఉత్తర కొరియా జరిపిన పరీక్ష చివరి దశ(ఉపగ్రహాన్ని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టడం) సక్రమంగా జరిగిందా అనే దానిపై ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థల నుంచి ఎలాంటి నిర్ధారణ లభించలేదు. ఉత్తర కొరియా ప్రయోగ నౌక అంతరిక్షంలోకి చేరుకున్నట్లు తెలుస్తోందని అమెరికా రక్షణ రంగ అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర కొరియా మాత్రం తమ పరీక్ష విజయవంతమైందని ప్రకటించింది.
ఆ దేశ అధికార టీవీలో ప్రత్యేక ప్రసారం ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలిపారు. ‘అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగత ఆదేశాల మేరకు.. భూ పరిశీలక ఉపగ్రహం క్వాంగ్‌మ్యాంగ్ 4ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టాం. మన దేశ రక్షణ సామర్థ్యాన్ని ఈ ప్రయోగం మరింత బలోపేతం చేసింది. మరిన్ని ఉపగ్రహ ప్రయోగాల కోసం మన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అంతరిక్ష శాంతియుత, స్వతంత్ర వినియోగంపై ఉత్తర కొరియాకు ఉన్న న్యాయమైన హక్కులో భాగంగా ఈ పరీక్ష జరిపాం’ అని ప్రకటించారు. దాంతో, రాజధాని ప్యాంగ్‌యాంగ్ సహా ఉత్తర కొరియా దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో వీధుల్లో సంబరాలు జరుపుకున్నారు.
ఆ రాకెట్లు ఉభయప్రయోజనకారులు
తమది శాంతియుత అంతరిక్ష కార్యక్రమమని ఉత్తర కొరియా వాదిస్తుండగా, ఆ దేశ రాకెట్లను సాధారణ అవసరాలతో పాటు సైనిక అవసరాలకు కూడా ఉపయోగపడేలా రూపొందించారని దక్షిణ కొరియా, అమెరికాలు పేర్కొంటున్నాయి. ఉపగ్రహాన్ని తీసుకువెళ్తున్న రాకెట్‌ను ఉత్తర కొరియా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రయోగించారని ఆ ప్రయోగ క్షేత్రంపై నిఘా పెట్టిన దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది. యోల్లో సీ మీదుగా దక్షిణం వైపు ఫిలిప్పైన్స్ సముద్రం పైనుంచి రాకెట్ అంతరిక్షం వైపునకు దూసుకెళ్లింది. తమ ప్రాదేశిక ప్రాంతం మీదుగా వెళ్తే దాన్ని పేల్చేస్తామని జపాన్, దక్షిణ కొరియా ప్రకటించాయి.
భద్రతా మండలి ఖండన.. ఉత్తర కొరియా ప్రయోగాన్ని భద్రతా మండలి తన భేటీలో తీవ్రంగా ఖండిం చింది. మండలి తీర్మానాన్ని ఉల్లంఘించిన ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించడంపై చర్చ జరిగింది.
ప్రయోగంపై స్పందనలు..
‘ఇది అస్థిరతకు దారితీసే రెచ్చగొట్టే చర్య. ఐరాస భద్రతామండలి తీర్మానాల దారుణ ఉల్లంఘన. కొరియా ద్వీపకల్పానికే కాదు అమెరికా రక్షణకూ ప్రమాదకరమైన ప్రయోగాల్లో ఇది రెండోది.’
- జాన్ కెర్రీ, అమెరికా విదేశాంగ మంత్రి
‘ప్రపంచ శాంతి, రక్షణలకు ఇది పెను సవాలు. ఐక్యరాజ్య సమితి తక్షణమే స్పందించాలి. ఉత్తరకొరియాపై కఠిన చర్యలు చేపట్టాలి’
- పార్క్ గ్వెన్ హే, ద.కొరియా అధ్యక్షురాలు
‘శాంతియుతంగా అంతరిక్షాన్ని వాడుకునే హక్కు ఉత్తరకొరియాకు ఉంది.కానీఅది ఐరాస భద్రతామండలి తీర్మానాలకు లోబడి ఉండాలి.’
- చైనా విదేశాంగ ప్రతినిధి హువ చున్యింగ్ (ఉత్తర కొరియాకు చైనా మిత్రదేశం. అయితే, ఉత్తర కొరియా అణు కార్యక్రమంతో విభేదాలొచ్చాయి. )
‘ఉత్తర కొరియా సహా మొత్తం ఈ ప్రాంతం సుస్థిరత, రక్షణలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముంది’
- రష్యా విదేశాంగ శాఖ ప్రకటన( రష్యా కూడా ఉత్తర కొరియా మిత్రదేశమే)
‘అత్యంత శోచనీయం. ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలను ఉత్తరకొరియా నిలిపేయాలి. అంతర్జాతీయ తీర్మానాలను గౌరవించాలి’
- బాన్ కి మూన్, ఐరాస ప్రధాన కార్యదర్శి