Ban Ki-moon
-
గాంధీ బోధనల్లో పరిష్కారం
సియోల్: ఉగ్రవాదం, వాతావరణ మార్పు అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలనీ, వీటికి పరిష్కారం మహాత్మా గాంధీ బోధనల్లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే గాంధీ బోధనలు, విలువలను అనుసరించడమే సరైన మార్గమన్నారు. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయంలో ఆ దేశాధ్యక్షుడు మూన్–జే–ఇన్, ఐక్యరాజ్య సమితి (ఐరాస) మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ–మూన్‌లతో కలిసి గాంధీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. భారత్–దక్షిణ కొరియాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతం లక్ష్యంగా, మూన్–జే–ఇన్ ఆహ్వానం మేరకు మోదీ గురువారం నుంచి రెండ్రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. బోధనలు, విలువల్లోనే పరిష్కారం.. మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలైన ఉగ్రవాదం, వాతావరణ మార్పులకు గాంధీ బోధనలు, ఆయన జీవిత విలువల్లోనే పరిష్కారం ఉందని మోదీ అన్నారు. ‘మనం గాంధీ జీవితాన్ని పరిశీలిస్తే ఈ రెండు సమస్యలకు పరిష్కారం కనుక్కోగలం. గాంధీ బోధనలు, ఆయన ఇచ్చిన ఐక్యతా స్ఫూర్తి, విలువలు, హింసా మార్గంలో వెళ్తున్న వారి మనసులను అహింసతో మార్చాలంటూ గాంధీ ఇచ్చిన సందేశాలే.. ఉగ్రవాదంపై పోరాటంలో మనకు దారి చూపగలవు’ అని మోదీ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా బాన్ కీ–మూన్ ఉండగానే గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. తర్వాతి తరాలకు హరిత గ్రహాన్ని అందించడం ముఖ్యమని గాంధీ బోధించారని తెలిపారు. మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తుండటం ఇది రెండోసారి. -
ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో
-
ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి తదుపరి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్ను సమితి సర్వసభ్య సభ గురువారం నియమించింది. సమితి 9వ సెక్రటరీ జనరల్‌గా 67 ఏళ్ల గుటెరెస్ నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని మొత్తం 193 దేశాల సర్వసభ్య సభ హర్షిస్తూ ఆమోదించింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. బాన్ తర్వాత ఆ పదవికి గుటెరెస్ను 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలి గత వారం ఎన్నుకుని, ఆయన పేరును సర్వసభ్య సభకు సిఫారసు చేసింది. గుటెరెస్ 1995 నుండి 2002 వరకూ పోర్చుగల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2005 జూన్ నుండి 2015 డిసెంబర్ వరకు శరణార్థులకు ఐరాస హైకమిషనర్‌గా ఉన్నారు. ఆయన 2007 జనవరి 1వ తేదీ నుండి సమితి సెక్రటరీ జనరల్‌గా కొత్త బాధ్యతలు చేపడతారు. ఈ పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత సభ్య దేశాలు ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు. -
4 నుంచి ప్యారిస్ ఒప్పందం అమల్లోకి
ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్ 4 నుంచి ప్యారిస్ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న 72 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. ఒకప్పుడు ఊహించడానికే సాధ్యం కాని ఈ ఒప్పందం ప్రస్తుతం ఎవరూ అడ్డగించలేని విధంగా అమల్లోకి వచ్చిందన్నారు. -
పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశం..
ఉగ్రవాదంతో యుద్ధ నేరాలకు పాల్పడుతోంది - ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై మండిపడిన భారత్ ఐక్యరాజ్యసమితి: పాకిస్థాన్‌పై విమర్శలకు భారత్ మరింత పదును పెట్టింది. పాక్ ఉగ్రవాద దేశమని, ఉగ్రవాదాన్ని పావుగా వాడి పాక్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మండిపడింది. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ తన ప్రసంగంలో కశ్మీర్ అంశాన్నీ, హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ గురించి ప్రస్తావించడాన్ని భారత్ తప్పుపట్టింది. ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా గురువారం భారత్ తన వాదనను సమర్థంగా వినిపించింది. బేషరతుగా ద్వైపాక్షిక చర్చలు జరపాలన్న షరీఫ్ వాదనను తోసిపుచ్చింది. పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, అక్కడ యుద్ధ యంత్రాల పాలన సాగుతోందని ధ్వజమెత్తింది. చేతిలో తుపాకీ పట్టుకుని చర్చలకు రావాలంటే ఎలా అని ప్రశ్నించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. పాక్ పూర్తిగా ఉగ్రవాద దేశమని, అంతర్జాతీయ వేదికపై ఆ దేశం అబద్ధాలు చేపుతోందని, దీనికి బుర్హన్ వనీ గురించి ఐరాసలో ప్రస్తావించడమే నిదర్శనమని ఆరోపించారు. తనను తాను ఉగ్రవాదిగా ప్రకటించుకున్న వ్యక్తి గురించి ఒక దేశాధినేత గొప్పగా చెప్పడం తమను దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు. తాము చర్చలకు ఎప్పుడు సిద్ధమే అని, అయితే వెన్నుపోటు, బ్లాక్మెయిల్ ద్వారా ఇస్లామాబాద్ ఉగ్రవాదులతో చేస్తున్న ప్రయత్నాలను అంగీకరించేది లేదన్నారు. సమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి ఈనమ్ గంభీర్ ఐరాస సర్వసభ్యసమావేశంలో పాక్ తీరును తప్పుబట్టారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడంతో భారత్‌సహా పొరుగు దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. పాక్ వల్ల ఉగ్రవాద సంస్థలకు వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ సహాయం అందుతోందని, దీంతో ఉగ్రవాద శిక్షణ, వారికి ఆర్థిక సాయం, పొరుగుదేశాలపై ఉగ్ర దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అధికారుల ఆమోద ముద్రతోనే పాక్‌లో ఉగ్రసంస్థలు నిధులు సమీకరించుకుంటున్నాయన్నారు. పాక్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చరిత్ర మోసాలు, వంచనతో కూడిందన్నారు. అంతర్జాతీయ సమాజానికి ఉగ్రవాదంపై అబద్ధపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు విద్యకు ప్రసిద్ధి గాంచిన తక్షశిల ఇప్పుడు ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఉగ్రవాద మద్దతుదారులు, శిక్షకులకు తక్షశిల స్థావరంగా మారిందన్నారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే క్రమంలో ఉడీ ఉగ్ర దాడి ఒక ట్రయల్ మాత్రమే అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద చర్యల నుంచి దేశ పౌరులను కాపాడటానికి భారత్ సిద్ధంగా ఉందని, ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ అంగీకరించేది లేదని గంభీర్ చెప్పారు. షరీఫ్ ప్రసంగమప్పుడు ఐరాస బయట ఆందోళనలు న్యూయార్క్: ఐరాసలో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతుండగా బలూచిస్తాన్, భారత ఆందోళనకారులు ఐరాస ప్రధాన కార్యాలయం బయట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. పాక్ ఉగ్రవాదాన్ని భారత్ కు ఎగుమతి చేయడం ఆపాలన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయం ఉన్న వీధంతా ఆందోళనకారులతో నిండిపోయింది. పాకిస్తాన్లో జరుగుతున్న అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలను వారు ఖండించారు. మీరే పరిష్కరించుకోండి: బాన్‌కీ మూన్ న్యూయార్క్: కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాలన్న పాకిస్తాన్ వరుస విజ్ఞప్తులను ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తోసిపుచ్చారు. కశ్మీర్ సహా అన్ని ద్వైపాక్షిక సమస్యలను భారత్, పాక్‌లే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధానికి సూచించారు. ఐరాస సమావేశాల సందర్భంగా బుధవారం షరీఫ్ బాన్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాలు, మొత్తం ఆసియా ప్రాంతం ప్రయోజనాల దృష్ట్యా చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని బాన్ షరీఫ్‌కు తెలిపినట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. -
మా పర్యవేక్షణ ఎల్‌వోసీకే పరిమితం: యూఎన్
కశ్మీర్‌లోని పరిస్థితుల పర్యవేక్షణను భారత్, పాక్‌లలోని తమ సైనిక పరిశీలక బృందం (యూఎన్‌ఎంవోజీఐపీ) కొనసాగిస్తుందని తొలుత ప్రకటించిన ఐక్యరాజ్య సమితి.. దాన్ని సవరిస్తూ మరో ప్రకటన చేసింది. తమ పర్యవేక్షణ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వరకే పరిమితమని స్పష్టం చేసింది. యూఎన్‌ఎంవోజీఐపీ ద్వారా కశ్మీర్లో తమ పర్యవేక్షణ కొనసాగిస్తామని బాన్ కీ మూన్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హాక్ మంగళవారం విలేకరులతో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజర్రిక్.. తమ పర్యవేక్షణ ఎల్వోసీ వరకే పరిమితమని స్పష్టం చేశారు. ‘నియంత్రణ రేఖ వెంబడి జరగుతున్న కాల్పుల విరమణపై నివేదించడమే యూఎన్‌ఎంవోజీఐపీ పని. కశ్మీర్లో జరుగుతున్న ఘటనలు భారత్ అంతర్గత వ్యవహరానికి సంబంధించినవి. అవి యూఎన్‌ఎంవోజీఐపీ పరిధిలోకి రావు. ఎల్వోసీ వెంబడి జరిగే ఘటనలను గమనించడం, నివేదించడమే దాని పని. అంతేకాని జమ్యూకశ్మీర్ పరిస్థితిని పర్యవేక్షించడం కాదు’ అని స్పష్టం చేశారు. -
ఉత్తర కొరియా మరో ధిక్కారం
♦ బాలిస్టిక్ మిస్సైల్ సాంకేతికతతో ఉపగ్రహ ప్రయోగం ♦ శాంతియుత అంతరిక్ష ప్రయోగమని సమర్థన అది బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగమంటున్న అమెరికా, ద. కొరియా ♦ తక్షణ ఆంక్షలకు అంతర్జాతీయ సమాజం డిమాండ్; ఐరాస అత్యవసర భేటీ సియోల్: అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను ధిక్కరించి నెల క్రితం అణు పరీక్ష జరిపిన ఉత్తర కొరియా.. ఆదివారం మరో దుస్సాహసానికి పాల్పడింది. ఒక ఉపగ్రహాన్ని బాలిస్టిక్ మిస్సైల్ సాంకేతికతతో లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టామని ప్రకటించింది. అయితే, అది బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అని, అమెరికాపై క్షిపణి దాడికి ఉపయోగపడగల ఆయుధ ప్రయోగ పరీక్ష అని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసరంగా భేటీ అయింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియాపై ఆంక్షల తక్షణ విధింపుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఉత్తర కొరియా చర్యను ఐరాస, నాటో సహా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ పరీక్ష ఐరాస తీర్మానాల ఉల్లంఘన అని, తక్షణమే ఆంక్షల విధింపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే, ఉత్తర కొరియా జరిపిన పరీక్ష చివరి దశ(ఉపగ్రహాన్ని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టడం) సక్రమంగా జరిగిందా అనే దానిపై ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థల నుంచి ఎలాంటి నిర్ధారణ లభించలేదు. ఉత్తర కొరియా ప్రయోగ నౌక అంతరిక్షంలోకి చేరుకున్నట్లు తెలుస్తోందని అమెరికా రక్షణ రంగ అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర కొరియా మాత్రం తమ పరీక్ష విజయవంతమైందని ప్రకటించింది. ఆ దేశ అధికార టీవీలో ప్రత్యేక ప్రసారం ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలిపారు. ‘అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగత ఆదేశాల మేరకు.. భూ పరిశీలక ఉపగ్రహం క్వాంగ్మ్యాంగ్ 4ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టాం. మన దేశ రక్షణ సామర్థ్యాన్ని ఈ ప్రయోగం మరింత బలోపేతం చేసింది. మరిన్ని ఉపగ్రహ ప్రయోగాల కోసం మన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అంతరిక్ష శాంతియుత, స్వతంత్ర వినియోగంపై ఉత్తర కొరియాకు ఉన్న న్యాయమైన హక్కులో భాగంగా ఈ పరీక్ష జరిపాం’ అని ప్రకటించారు. దాంతో, రాజధాని ప్యాంగ్యాంగ్ సహా ఉత్తర కొరియా దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో వీధుల్లో సంబరాలు జరుపుకున్నారు. ఆ రాకెట్లు ఉభయప్రయోజనకారులు తమది శాంతియుత అంతరిక్ష కార్యక్రమమని ఉత్తర కొరియా వాదిస్తుండగా, ఆ దేశ రాకెట్లను సాధారణ అవసరాలతో పాటు సైనిక అవసరాలకు కూడా ఉపయోగపడేలా రూపొందించారని దక్షిణ కొరియా, అమెరికాలు పేర్కొంటున్నాయి. ఉపగ్రహాన్ని తీసుకువెళ్తున్న రాకెట్‌ను ఉత్తర కొరియా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రయోగించారని ఆ ప్రయోగ క్షేత్రంపై నిఘా పెట్టిన దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది. యోల్లో సీ మీదుగా దక్షిణం వైపు ఫిలిప్పైన్స్ సముద్రం పైనుంచి రాకెట్ అంతరిక్షం వైపునకు దూసుకెళ్లింది. తమ ప్రాదేశిక ప్రాంతం మీదుగా వెళ్తే దాన్ని పేల్చేస్తామని జపాన్, దక్షిణ కొరియా ప్రకటించాయి. భద్రతా మండలి ఖండన.. ఉత్తర కొరియా ప్రయోగాన్ని భద్రతా మండలి తన భేటీలో తీవ్రంగా ఖండిం చింది. మండలి తీర్మానాన్ని ఉల్లంఘించిన ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించడంపై చర్చ జరిగింది. ప్రయోగంపై స్పందనలు.. ‘ఇది అస్థిరతకు దారితీసే రెచ్చగొట్టే చర్య. ఐరాస భద్రతామండలి తీర్మానాల దారుణ ఉల్లంఘన. కొరియా ద్వీపకల్పానికే కాదు అమెరికా రక్షణకూ ప్రమాదకరమైన ప్రయోగాల్లో ఇది రెండోది.’ - జాన్ కెర్రీ, అమెరికా విదేశాంగ మంత్రి ‘ప్రపంచ శాంతి, రక్షణలకు ఇది పెను సవాలు. ఐక్యరాజ్య సమితి తక్షణమే స్పందించాలి. ఉత్తరకొరియాపై కఠిన చర్యలు చేపట్టాలి’ - పార్క్ గ్వెన్ హే, ద.కొరియా అధ్యక్షురాలు ‘శాంతియుతంగా అంతరిక్షాన్ని వాడుకునే హక్కు ఉత్తరకొరియాకు ఉంది.కానీఅది ఐరాస భద్రతామండలి తీర్మానాలకు లోబడి ఉండాలి.’ - చైనా విదేశాంగ ప్రతినిధి హువ చున్యింగ్ (ఉత్తర కొరియాకు చైనా మిత్రదేశం. అయితే, ఉత్తర కొరియా అణు కార్యక్రమంతో విభేదాలొచ్చాయి. ) ‘ఉత్తర కొరియా సహా మొత్తం ఈ ప్రాంతం సుస్థిరత, రక్షణలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముంది’ - రష్యా విదేశాంగ శాఖ ప్రకటన( రష్యా కూడా ఉత్తర కొరియా మిత్రదేశమే) ‘అత్యంత శోచనీయం. ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలను ఉత్తరకొరియా నిలిపేయాలి. అంతర్జాతీయ తీర్మానాలను గౌరవించాలి’ - బాన్ కి మూన్, ఐరాస ప్రధాన కార్యదర్శి -
ఐఎస్‌కు 34 సంస్థల విధేయత
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 34 మిలిటెంట్ గ్రూపులు గతేడాది డిసెంబర్ నాటికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు విధేయత ప్రకటించాయని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తెలిపారు. ఈ ఏడాది వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, లిబియా, నైజీరియా వంటి దేశాల్లో ఐఎస్ అనుబంధ గ్రూపులు మరిన్ని దాడులకు పాల్పడవచ్చని ఆయన హెచ్చరించారు. -
చివరి ప్రయత్నం
పర్యావరణ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి కసరత్తు ♦ సమావేశాలు మరో రోజు పొడిగింపు పారిస్: ఫ్రాన్స్‌లో 12 రోజులుగా జరుగుతున్న పర్యావరణ సదస్సులో కీలక ఒప్పందంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవటంతో.. భేటీలను మరోరోజు పొడగించాలని నిర్ణయించారు. గురువారం రాత్రంతా వివిధ దేశాల మంత్రులు కూర్చుని చర్చించినా పెద్దగా సాధించిందేమీ లేదు. కర్బన ఉద్గారాలు, నిధులను అందించే విషయాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో.. పర్యావరణంపై చరిత్రాత్మక ఒప్పందంపై ఏకాభిప్రాయం కోసం చివరిసారిగా భేటీ కానున్నారు. ఉద్గారం, నిధుల అందజేత విషయంలో ముందుగా నిర్ణయించిన అంశాలను అమలుచేయాల్సిందేనని భారత్, చైనాలు పట్టుబడుతున్నాయి. ఉష్ణోగ్రత పెరగటం వల్ల నష్టపోయే దేశాలు, పేద దేశాలకు ఆర్థిక సహాయం చేసే విషయంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సమన్వయం కుదరకపోవటమే.. ఒప్పందంపై ఏకాభిప్రాయానికి సమస్యగా మారింది. కాగా, ప్రపంచ మానవాళిని దృష్టిలో ఉంచుకుని సభ్యులు సానుకూలంగా ఆలోచించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ కోరారు. మరోవైపు, ఒప్పందం ముసాయిదాలో పేజీల సంఖ్య 27 పేజీలకు చేరింది. తుది ముసాయిదాలో భారత్ చేసిన సూచనలకు చోటు కల్పించారు. అయితే ఈ ముసాయిదా వల్ల పర్యావరణానికి ఒనగూరే లాభమేమీ లేదని.. సమయం మించిపోతున్నందున మంత్రులు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని గ్రీన్పీస్తోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కోరాయి. అయితే.. సంపన్నదేశాలే ఎక్కువ ఉద్గారానికి కారణమవుతున్నాయని ప్రకాశ్ జవదేకర్ పునరుద్ఘాటించారు. ఈ దేశాలు వాస్తవాన్ని ఆలోచిస్తే.. పర్యావరణ సమస్యకు చాలామట్టుకు పరిష్కారం లభిస్తుందనానరు. కాగా, కీలకమైన చివరి సమావేశానికి ముందు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. -
ఐరాసలో మళ్లీ కశ్మీర్ ప్రస్తావన తెచ్చిన పాక్
పాకిస్థాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకుంది. కశ్మీర్ అంశంలో మూడో పక్షం జోక్యం ఉండకూడదని భారత్ పదేపదే చెబుతున్నా, దొరికిన ప్రతి వేదికపైనా ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. తాజాగా జమ్ము కశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్‌ను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోరారు. అలాగే ఐక్యరాజ్య సమితికి చెందిన సైనిక పరిశీలన బృందం ఒకటి భారత్, పాకిస్థాన్‌ల కోసం ఏర్పాటుచేయాలన్నారు. అయితే ఐక్యరాజ్య సమితిలో బాన్ కీ మూన్ ప్రతినిధి మాత్రం, భారత్, పాక్‌లు శాంతియుత చర్చలను కొనసాగించాలని మాత్రమే మూన్ ఆకాంక్షించినట్లు తెలిపారు. ఉగ్రవాదంపై పోరు గురించి చర్చించామన్నారు. ఇక ఐక్యరాజ్య సమితిలో జరిగిన ప్రసంగాలలో కూడా చాలామంది దేశాధ్యక్షులు కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడగా, బెలారస్, వెనిజువెలా లాంటి వాళ్లు మాత్రం పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్క నవాజ్ షరీఫ్ మాత్రం ద్వైపాక్షిక అంశాలను కూడా అక్కడ ప్రస్తావించారు. కాగా, ఆయనకు వచ్చేవారం జరిగే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. అప్పుడు కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తారనే భావిస్తున్నారు. -
'ప్రత్యక్ష చర్చలకు రండి'
న్యూయార్క్: భారతదేశం, పాకిస్థాన్ నేరుగా ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రత్యక్ష చర్చల ద్వారా నిలువరించుకోవచ్చని చెప్పారు. 'మేం ప్రపంచంలోని అన్ని దేశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మార్పులను గమనిస్తున్నాం. పరిస్థితులు చేయిదాటే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అణ్వాయుధ సామర్ధ్యం కలిగి ఉన్న భారత్, పాక్‌లు నేరుగా చర్చలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను' అని బాన్ కీమూన్ చెప్పినట్లు ఆయన అధికారిక ప్రతినిధి స్పెపానే దుజార్రిక్ విలేకరులకు తెలిపారు. గత నెలలో 23-24 మధ్య జరగాల్సిన చర్చలు అనూహ్యంగా రద్దవడంపట్ల బాన్ కీమూన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. ఇరు దేశాల సరిహద్దుల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న అంశాలు తమ దృష్టికి వస్తున్నాయని, దీనిపట్ల కొన్ని సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. -
నైజీరియాకు యూఎన్ మద్దతు ఉంటుంది
ఐక్యరాజ్యసమితి: నైజీరియాలో తీవ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ శనివారం ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నైజీరియాకు ఐక్యరాజ్య సమితి సంపూర్ణ మద్దతుగా ఇస్తుందని తెలిపారు. గత వారం రోజులుగా తీవ్రవాదులు జరుపుతున్న దాడుల్లో నైజీరియాలో దాదాపు 60 మంది మరణించారు. శుక్రవారం ఒక్కరోజే ఈద్ పండగ సందర్భం ప్రార్థనలు చేస్తున్న వారిపై తీవ్రవాదల చేసిన దాడిలో 50 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
పెషావర్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి
ఐక్యరాజ్యసమితి: పెషావర్ లో ఉగ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ ఖండించారు. ఉగ్రవాదులు పాల్పడిన కిరాతకానికి కారణమే లేదని పేర్కొన్నారు. పాఠశాలలో చదువుకునేందుకు వచ్చిన అమాయక పిల్లలపై పాశవికంగా దాడి చేయడం దారుణమన్నారు. దాడిలో మృతి చెందిన వారి కుటుంబాల వెంటే ప్రపంచంలోని అందరి హృదయాలు ఉన్నాయని పేర్కొన్నారు. దాడికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని బాన్‌కీమూన్ కోరారు.