చివరి ప్రయత్నం
పర్యావరణ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి కసరత్తు
♦ సమావేశాలు మరో రోజు పొడిగింపు
పారిస్: ఫ్రాన్స్‌లో 12 రోజులుగా జరుగుతున్న పర్యావరణ సదస్సులో కీలక ఒప్పందంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవటంతో.. భేటీలను మరోరోజు పొడగించాలని నిర్ణయించారు. గురువారం రాత్రంతా వివిధ దేశాల మంత్రులు కూర్చుని చర్చించినా పెద్దగా సాధించిందేమీ లేదు. కర్బన ఉద్గారాలు, నిధులను అందించే విషయాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో.. పర్యావరణంపై చరిత్రాత్మక ఒప్పందంపై ఏకాభిప్రాయం కోసం చివరిసారిగా భేటీ కానున్నారు. ఉద్గారం, నిధుల అందజేత విషయంలో ముందుగా నిర్ణయించిన అంశాలను అమలుచేయాల్సిందేనని భారత్, చైనాలు పట్టుబడుతున్నాయి.
ఉష్ణోగ్రత పెరగటం వల్ల నష్టపోయే దేశాలు, పేద దేశాలకు ఆర్థిక సహాయం చేసే విషయంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సమన్వయం కుదరకపోవటమే.. ఒప్పందంపై ఏకాభిప్రాయానికి సమస్యగా మారింది. కాగా, ప్రపంచ మానవాళిని దృష్టిలో ఉంచుకుని సభ్యులు సానుకూలంగా ఆలోచించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ కోరారు. మరోవైపు, ఒప్పందం ముసాయిదాలో పేజీల సంఖ్య 27 పేజీలకు చేరింది.
తుది ముసాయిదాలో భారత్ చేసిన సూచనలకు చోటు కల్పించారు. అయితే ఈ ముసాయిదా వల్ల పర్యావరణానికి ఒనగూరే లాభమేమీ లేదని.. సమయం మించిపోతున్నందున మంత్రులు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని గ్రీన్‌పీస్‌తోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కోరాయి. అయితే.. సంపన్నదేశాలే ఎక్కువ ఉద్గారానికి కారణమవుతున్నాయని ప్రకాశ్ జవదేకర్ పునరుద్ఘాటించారు. ఈ దేశాలు వాస్తవాన్ని ఆలోచిస్తే.. పర్యావరణ సమస్యకు చాలామట్టుకు పరిష్కారం లభిస్తుందనానరు. కాగా, కీలకమైన చివరి సమావేశానికి ముందు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు.