పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశం..
ఉగ్రవాదంతో యుద్ధ నేరాలకు పాల్పడుతోంది
- ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై మండిపడిన భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్థాన్‌పై విమర్శలకు భారత్ మరింత పదును పెట్టింది. పాక్ ఉగ్రవాద దేశమని, ఉగ్రవాదాన్ని పావుగా వాడి పాక్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మండిపడింది. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ తన ప్రసంగంలో కశ్మీర్ అంశాన్నీ, హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ గురించి ప్రస్తావించడాన్ని భారత్ తప్పుపట్టింది. ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా గురువారం భారత్ తన వాదనను సమర్థంగా వినిపించింది. బేషరతుగా ద్వైపాక్షిక చర్చలు జరపాలన్న షరీఫ్ వాదనను తోసిపుచ్చింది. పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, అక్కడ యుద్ధ యంత్రాల పాలన సాగుతోందని ధ్వజమెత్తింది. చేతిలో తుపాకీ పట్టుకుని చర్చలకు రావాలంటే ఎలా అని ప్రశ్నించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. పాక్ పూర్తిగా ఉగ్రవాద దేశమని, అంతర్జాతీయ వేదికపై ఆ దేశం అబద్ధాలు చేపుతోందని, దీనికి బుర్హన్ వనీ గురించి ఐరాసలో ప్రస్తావించడమే నిదర్శనమని ఆరోపించారు.
తనను తాను ఉగ్రవాదిగా ప్రకటించుకున్న వ్యక్తి గురించి ఒక దేశాధినేత గొప్పగా చెప్పడం తమను దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు. తాము చర్చలకు ఎప్పుడు సిద్ధమే అని, అయితే వెన్నుపోటు, బ్లాక్‌మెయిల్ ద్వారా ఇస్లామాబాద్ ఉగ్రవాదులతో చేస్తున్న ప్రయత్నాలను అంగీకరించేది లేదన్నారు. సమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి ఈనమ్ గంభీర్ ఐరాస సర్వసభ్యసమావేశంలో పాక్ తీరును తప్పుబట్టారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడంతో భారత్‌సహా పొరుగు దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. పాక్ వల్ల ఉగ్రవాద సంస్థలకు వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ సహాయం అందుతోందని, దీంతో ఉగ్రవాద శిక్షణ, వారికి ఆర్థిక సాయం, పొరుగుదేశాలపై ఉగ్ర దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అధికారుల ఆమోద ముద్రతోనే పాక్‌లో ఉగ్రసంస్థలు నిధులు సమీకరించుకుంటున్నాయన్నారు. పాక్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చరిత్ర మోసాలు, వంచనతో కూడిందన్నారు.
అంతర్జాతీయ సమాజానికి ఉగ్రవాదంపై అబద్ధపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు విద్యకు ప్రసిద్ధి గాంచిన తక్షశిల ఇప్పుడు ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఉగ్రవాద మద్దతుదారులు, శిక్షకులకు తక్షశిల స్థావరంగా మారిందన్నారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే క్రమంలో ఉడీ ఉగ్ర దాడి ఒక ట్రయల్ మాత్రమే అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద చర్యల నుంచి దేశ పౌరులను కాపాడటానికి భారత్ సిద్ధంగా ఉందని, ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ అంగీకరించేది లేదని గంభీర్ చెప్పారు.
షరీఫ్ ప్రసంగమప్పుడు ఐరాస బయట ఆందోళనలు
న్యూయార్క్: ఐరాసలో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతుండగా బలూచిస్తాన్, భారత ఆందోళనకారులు ఐరాస ప్రధాన కార్యాలయం బయట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. పాక్ ఉగ్రవాదాన్ని భారత్ కు ఎగుమతి చేయడం ఆపాలన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయం ఉన్న వీధంతా ఆందోళనకారులతో నిండిపోయింది. పాకిస్తాన్‌లో జరుగుతున్న అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలను వారు ఖండించారు.
మీరే పరిష్కరించుకోండి: బాన్‌కీ మూన్
న్యూయార్క్: కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాలన్న పాకిస్తాన్ వరుస విజ్ఞప్తులను ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తోసిపుచ్చారు. కశ్మీర్ సహా అన్ని ద్వైపాక్షిక సమస్యలను భారత్, పాక్‌లే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధానికి సూచించారు. ఐరాస సమావేశాల సందర్భంగా బుధవారం షరీఫ్ బాన్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాలు, మొత్తం ఆసియా ప్రాంతం ప్రయోజనాల దృష్ట్యా చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని బాన్ షరీఫ్‌కు తెలిపినట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు.