![Narendra Modi Unveils Mahatma Gandhi Statue In Seoul - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/22/Gandhi-Statue-In-Seoul.jpg.webp?itok=AKteLVbE)
సియోల్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మోదీ, మూన్–జే–ఇన్ తదితరులు
సియోల్: ఉగ్రవాదం, వాతావరణ మార్పు అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలనీ, వీటికి పరిష్కారం మహాత్మా గాంధీ బోధనల్లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే గాంధీ బోధనలు, విలువలను అనుసరించడమే సరైన మార్గమన్నారు. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయంలో ఆ దేశాధ్యక్షుడు మూన్–జే–ఇన్, ఐక్యరాజ్య సమితి (ఐరాస) మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ–మూన్‌లతో కలిసి గాంధీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. భారత్–దక్షిణ కొరియాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతం లక్ష్యంగా, మూన్–జే–ఇన్ ఆహ్వానం మేరకు మోదీ గురువారం నుంచి రెండ్రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
బోధనలు, విలువల్లోనే పరిష్కారం..
మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలైన ఉగ్రవాదం, వాతావరణ మార్పులకు గాంధీ బోధనలు, ఆయన జీవిత విలువల్లోనే పరిష్కారం ఉందని మోదీ అన్నారు. ‘మనం గాంధీ జీవితాన్ని పరిశీలిస్తే ఈ రెండు సమస్యలకు పరిష్కారం కనుక్కోగలం. గాంధీ బోధనలు, ఆయన ఇచ్చిన ఐక్యతా స్ఫూర్తి, విలువలు, హింసా మార్గంలో వెళ్తున్న వారి మనసులను అహింసతో మార్చాలంటూ గాంధీ ఇచ్చిన సందేశాలే.. ఉగ్రవాదంపై పోరాటంలో మనకు దారి చూపగలవు’ అని మోదీ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా బాన్ కీ–మూన్ ఉండగానే గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. తర్వాతి తరాలకు హరిత గ్రహాన్ని అందించడం ముఖ్యమని గాంధీ బోధించారని తెలిపారు. మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తుండటం ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment