
సియోల్: దక్షిణా కొరియా ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక సియోల్ శాంతి బహుమతిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అందుకున్నారు. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ అభివృద్ధికి చేసిన సేవలకుగానూ దక్షిణకొరియా ప్రభుత్వం సియోల్ శాంతి బహుమతిని మోదీకి ప్రదానం చేసింది. ఈ అవార్డు తనకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదని, ఇది దేశ ప్రజలకు చెందుతుందని మోదీ అన్నారు. గత అయిదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు దక్కుతుందన్నారు.
మహాత్మా గాంధీ150వ జయంతి జరుగుతున్న సంవత్సరంలో ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని మోదీ చెప్పారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుసవాళ్లని పేర్కొన్నారు. 1988లో సియోల్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరగడానికి కొన్ని వారాల ముందే ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ ఏర్పడిందని, ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం .. ప్రపంచదేశాలకు సమస్యగా మారిందన్నారు. సియోల్ శాంతి బహుమతి గతంలో అందుకున్న ప్రముఖుల్లో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్, జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజిలా మోర్కెల్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment