ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమే: కొరియా సవాల్!
అమెరికా సైన్యం కవ్వింపు చర్యల నేపథ్యంలో ఎలాంటి యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా తాజాగా మరోసారి స్పష్టం చేసింది. క్షిపణికి, క్షిపణితో, అణుదాడికి అణుదాడితో తాము బదులిస్తామని పేర్కొంది. అమెరికా సైనిక శక్తిని పరీక్షించే సాహసం చేయవద్దంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియా రాయబారి కిమ్ ఇన్ ర్యాంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ‘అమెరికా సైనిక దాడులకు దిగేందుకు సాహసిస్తే.. అంతేదీటుగా బదులిచ్చేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉంది. అమెరికన్లు తలపెట్టే ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధం’ అని అన్నారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎవరైనా కవ్వింపుచర్యలకు దిగితే.. చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా సైనిక చర్యల నేపథ్యంలోనే ఆత్మరక్షణ కోసం కావాల్సిన చర్యలను ఉత్తరకొరియా తీసుకుంటున్నదని, అణుబాంబు దాడులను, అణుబాంబులతో, ఖండాతర క్షిపణి దాడులను అదేరకమైన దాడులతో తిప్పికొట్టాలని తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. అమెరికా వైమానిక యుద్ధవాహక నౌకను కొరియా ద్వీపకల్పంలో మోహరించడం ఉత్తరకొరియాపై దురాక్రమణకు ప్రయత్నించడమేనని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఉత్తరకొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు తాము ప్రతి చర్యలకు దిగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు.