‘పచ్చ’ అల్టిమేటం!
టీడీపీ అధికారంలో ఉన్నంత వరకూ గ్రామంలో అడుగు పెట్టొద్దని హుకుం
అంత్యక్రియలకు వచ్చినందుకు విచక్షణారహితంగా దాడి
టీటీడీ మెంబర్ పుట్టా సుధాకర్ స్వగ్రామంలో అనధికార ఎమర్జెన్సీ
వత్తాసు పలుకుతోన్న బి.మఠం పోలీసులు
జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అధికారం అండతో పేదల హక్కులను కాలరాస్తున్నారు. పార్టీ కండువా కప్పుకోలేదన్న కారణంతో తాము అధికారంలో ఉన్నంత వరకు ఊర్లోకి అడుగుపెట్టొద్దంటూ హకుం జారీ చేస్తున్నారు. చివరికి అంత్యక్రియలకు, కర్మకాండలకు సైతం హాజరు కావొద్దంటూ ఓ మహిళపై దాడికి పాల్పడటం చూస్తుంటే అనధికార ఎమర్జెన్సీని తలపిస్తోంది.
కడప:మైదుకూరు నియోజకవర్గంలో కొంత కాలంగా అనధికార ఎమర్జెన్సీ అమలులో ఉంది. తమ మాట వినని వారిపై టీడీపీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయి. టీడీపీ తీర్థం పుచ్చుకోని ఫెస్టిసైడ్స్ వ్యాపారులపై వ్యవసాయాధికారులు తనిఖీలంటూ వేధింపులకు పాల్పడడం.. పార్టీ మారని రేషన్ డీలర్లపై విజిలెన్సు కేసులు పెట్టడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. ఉపాధి హామీ పథకం పీల్డ్ అసిస్టెంట్లు టీడీపీ తీర్థం పుచ్చుకోకపోతే తప్పుడు కేసులు బనాయించడం.. ఉన్నతాధికారుల వేధింపులు.. ఆపై ఉపాధి నుంచి తప్పించడం సర్వసాధారణమైంది. తాజాగా ఇలాంటి ఘటనే టీటీడీ మెంబర్ పుట్టా సుధాకర్ సొంత పంచాయతీలోనూ చోటు చేసుకుంది.
బి.మఠం మండలం పలుగురాళ్లపల్లె పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంటుగా జాలా శివ పని చేస్తున్నారు. శివ స్వగ్రామం ఆ పంచాయితీ పరిధిలోని జౌకుపల్లె. శివ కుటుంబ సభ్యులు టీడీపీ కండువా వేసుకోలేదని వేధింపులు, అనధికారికంగా గ్రామ బహిష్కరణకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఎన్నికల వరకూ టీడీపీ నేత పుట్టాసుధాకర్, వైఎస్సార్సీపీ నేత జెడ్పీటీసీ సభ్యుడు రాంగోవిందురెడ్డి ఉప్పు-నిప్పుగా ఉన్నారు.
ఇటీవల కాలంలో జెడ్పీటీసీ సభ్యుడు రాంగోవిందురెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు నేతలు ఓకే పంచాయతీ వాసులు కావడం, అధికార పార్టీ కావడంతో మరో పార్టీకి చెందిన వారు గ్రామంలో ఉండరాదని, వీరి అనుచరులు దర్పం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు గ్రామం విడిచి వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో ప్రత్యక్ష పోరాటం చేయలేని నిస్సహాయ స్థితిలో వారు అనుకూలమైన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈక్రమంలో ఈనెల 14న ఆ గ్రామానికి చెందిన జాలా ప్రకాశం (54) చనిపోయారు.
కుటుంబ పెద్ద వృతి చెందడంతో జాలా కుమారి (కోడలు), బందెన్న, రాజశేఖర్ తదితరులు గ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామంలోకి రావద్దని ఆదేశించినా అంత్యక్రియలకు వస్తారా అంటూ టీడీపీ నేతలు విక్షణ మరిచి ప్రత్యక్ష దాడికి తెగబడ్డారు. మహిళలనీ కూడ చూడకుండా దాడి చేయడంతోపాటు నిర్బంధించారు. వీరు చేసిన నేరం పచ్చ కండువా భుజాన వేసుకోక పోవడమేనని తెలుస్తోంది. ఈ ఘటనపై బి.మఠం పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీస చొరవ చూపలేదని బాధితులు వాపోతున్నారు.
కర్మక్రియలకు సైతం హాజరు కారాదట!
కర్మక్రియలకు సైతం జాలా బండెన్న కుటుంబం గ్రామంలోకి రాకుడదని దాడులకు పాల్పడ్డ పుట్టా సుధాకర్ వర్గీయులు ఆంక్షలు విధించారు. ‘అంత్యక్రియలుకు హాజరైన నాపై దాడి చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీస స్పందన లే దు.. గురువారం (28న) కర్మక్రియలు ఉన్నాయి. మా చిన్నమ్మ లక్ష్ముమ్మ పుస్తెలు, గాజులు తీయాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సైతం రాకుడదని ఆదేశించారు. గ్రామంలోకి వెళితే మాపై దాడి జరిగే అవకాశం ఉంది’ అని జాలా కుమారి జిల్లా ఎస్పీ నవీన్గులాటీకి ఫిర్యాదు చేసింది.
ఎలాంటి తప్పు చేయకపోయినా తమ కుటుంబంపై దాడులు చేస్తున్నారని, బి.మఠం పోలీసులు సైతం నిందుతులకే వత్తాసుగా నిలుస్తున్నారని ఆమె వాపోయారు. ఈనెల 14న దాడి జరిగితే 23వ తేది వర కు కేసు నమోదు చేయలేదని, ఈనెల 22న ఏఎస్పీని కలిశాక కేసు నమోదు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనలో నిందితులపై చర్య తీసుకోవాలని ఎస్పీ.. మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణంను ఆదేశించారు. గురువారం కర్మక్రియలకు హాజరు కావాలంటే వారికి పోలీసుల రక్షణ తప్పనిసరి. ఈ విషయమై వివరణ కోరేందుకు ఫోన్లో సిఐ నాగభూషణంను సంప్రదించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.