ఎవరికీ పట్టని సర్వసభ్య సమావేశం
మిరుదొడ్డి: ప్రజాప్రతినిధుల్లో సమయ పాలన కొరవడింది. వీరికి అధికారులు తోడయ్యారు. వెరసి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని గంటన్నరలోపే ముగించేశారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్యసభ్య సమావేశం జరిగింది.
సమావేశానికి ఎంపీపీ పంజాల కవిత నిర్ణీత సమయానికి వచ్చినప్పటికీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు ఎవరూ లేక సమావేశం ప్రారంభం కాలేదు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి ఎవరూ రాక పోవడంతో ఎంపీపీ కవిత ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా అభ్యర్థించడం కనిపించింది.
12 గంటలకు ప్రారంభమైన సమావేశానికి ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు రావడంతోనే సరిపోయింది. మండల పరిధిలో 11 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఆరుగురు, 16 సర్పంచ్లకు గాను ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. వీరికి తోడు వివిధ శాఖల అధికారులు చాలా మట్టుకు డుమ్మాలు కొట్టారు.
దీంతో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడంతో అధికారుల తీరును ప్రశ్నించే నాథులు కరువయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల దవాఖాన కొత్త భవన నిర్మాణంపై అధికారులు సహకరించడం లేదని, మిషన్ భగీరథ పనుల్లో తీసిన కాలువలు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కాలువలతో జనాలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని మిరుదొడ్డి సర్పంచ్ మద్దెల రోషయ్య సమస్యను లేవనెత్తారు.
సెరికల్చర్ అధికారులు పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కలిగించకుండా ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని లక్ష్మీనగర్ సర్పంచ్ చిప్ప శివకుమార్ లేవనెత్తడం మినహాయిస్తే సర్వసభ్య సమావేశం అంతా తూతూ మంత్రంగానే సాగింది.
ప్రజా సమస్యలపై ఇంత నిర్లక్ష్యం తగదు
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడం తగదని ఎంపీపీ పంజాల కవిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు సమయపాలన పాటించకపోవడం దారుణమన్నారు.
ఒక దశలో ప్రజాప్రతినిధులు సమావేశానికి రావాల్సిందిగా తానే ఫోన్ చేసి అభ్యర్థించాల్సి వచ్చిందని, ఇది విచారకరమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమయ పాలన విధిగా పాటించాలని ఘాటుగా హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ నీలకంఠ మఠం నగేష్, ఇన్చార్జి తహసీల్దార్ ఉమారాణి, ఎంఈఓ జోగు ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.