నిత్య పెళ్లికొడుకు అరెస్టు
కేకేనగర్: మదురై, చెన్నై సహా పలు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువతులను పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్టు చేశారు. మదురై పుదూర్ ఈబీ కాలనీకి చెందిన సలామియా భాను (28) కొన్ని రోజుల క్రితం మదురై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. అందులో మదురై ఎల్లీస్ నగర్‌కు చెందిన తస్లిమా తనకూ ఖాదర్‌బాషా అనే వ్యక్తికి పెళ్లి చేసిందని పేర్కొంది. పెళ్లి చేసేముందు ఖాదర్‌బాషా తమ ధువేనని, బ్యాంకులో పనిచేస్తున్నాడని చెప్పిందన్నారు.
కాగా ఈ నెల రెండవ తేదీన ఇంట్లో ఉంచిన రూ. 3 లక్షలు, ఎనిమిది సవర్ల బంగారు నగలు, ఏటీఎం కార్డును తన భర్త తీసుకెళ్లాడని చెప్పింది. కొన్న రోజుల అనంతరం అతని ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో అనుమానించిన తాను భ ర్త వివరాలు సేకరించగా అప్పటికే ఖాదర్‌బాషా చెన్నైకు చెందిన నిర్మల, దిండుగల్ జమునారాణి, వత్సలగుండు మహాలక్ష్మి, ఇలా తనతో కలిపి ఎనిమిది మందిని వివాహం చేసుకుని మోసం చేసినట్లు తెలిపింది. ఈమె ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తూత్తుకుడిలో తలదాచుకున్న నిందితుడిని అరెస్టు చేశారు.
పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
చోరీయత్నం: ముగ్గురి అరెస్టు: చోరీ యత్నం కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై తురైపాక్కం పెరుంగుడికి చెందిన సరళ ఇనుప దుకాణం యజమాని. ఇక్కడ వాచ్‌మెన్‌గా ఆనందన్ (54) పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా నవీన్ (25), ఆల్బర్ట్ (22), రామమూర్తి (20)లు ముగ్గురూ ఆదివారం రాత్రి దుకాణంలోని ఇనుప సామాన్లను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. వాచ్మెన్ ఆనందన్ అడ్డుకోవడంతో ఆనందన్‌ను కత్తితో పొడిచి పారిపోయారు. పోలీసులు తీవ్ర విచారణ జరిపి ముగ్గురిని అరెస్టు చేశారు.