హృ‘దయనీయం’
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ గుండె (హృదయం) జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అకాల మరణానికి గురి చేసే గుండెజబ్బులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా భారత్‌ను గుండెజబ్బులు పట్టిపీడిస్తున్నాయి. ప్రపంచంలో గుండె జబ్బు రోగుల్లో 60 శాతం మంది భారతీయులే కావడం దయనీయం. మనిషి మరణానికి 28 నుంచి 30 శాతం వరకు గుండె జబ్బులే కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోమవారం వరల్డ్ హార్ట్‌డే జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
గుండె పోటు లక్షణాలు...
గుండె జబ్బులలో ముఖ్యమైనది గుండె పోటు (హార్ట్ ఎటాక్). గుండె పోటు వచ్చిన వ్యక్తి ఛాతిలో నొప్పి రావడం మొదలై, విపరీతంగా చెమటలు పట్టడం, ఛాతినుంచి నొప్పి వీపు భాగానికి, భుజాలకు విస్తరించడం, ఎడమ చిటికెన వేలు నొప్పి పుట్టడం మొదలై దవడ వరకు వ్యాపించడం వంటివి లక్షణాలుగా చెప్పవచ్చు. గుండెకు రక్తం సరఫరా తగ్గినపుడు గుండెపోటు కాకుండా నొప్పితో కూడిన హెచ్చరికను (అన్స్టేబుల్ యాంజిన) గమనించవచ్చు. గుండె జబ్బు తీవ్రతను బట్టి గుండె పోటు వచ్చినప్పుడు అకస్మాత్తుగా చనిపోతారు. కొంతమందిలో గుండె వేగం మరీ తక్కువగా (60 సార్లకంటే తక్కువ), ఇంకొందరిలో మరీ వేగంగా (160 సార్లకంటే ఎక్కువ) ఉండటం కూడా గుండె పోటుకు దారి తీసే లక్షణం. ఎలాంటి నొప్పి, కష్టం లేకుండా కూడా కొన్ని సార్లు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
ప్రథమ చికిత్స...
గుండె పోటు వచ్చినట్టు భావించిన రోగిని విశ్రాంతిగా కూర్చోబెట్టాలి.
వెంటనే డిస్ప్రిన్, యాస్ప్రిన్ 150 మిల్లీ గ్రాముల మాత్రను 350 మిల్లీ గ్రాముల నీళ్లలో కరిగించి తాగించాలి.
ఇలా చేయడం ద్వారా గుండెపోటుతో మరణించే అవకాశాలు 22 శాతం తగ్గుతాయి.
ప్రథమ చికిత్సను ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఇవ్వవచ్చు.
సోర్బిట్రేట్, ఐసార్డిల్ 5 మి.గ్రా. మాత్రను నాలుక కింద పెట్టడం ద్వారా గుండె నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
వీలైనంత త్వరగా ఈసీజీ తీసి గుండె పోటును నిర్ధారించి వెంటనే ఐసీయూలో వైద్యం పొందాలి.