తస్మాత్ జాగ్రత్త!
- అకాల వర్షాలు ప్రారంభం
- పొంచి ఉన్న పెనుగాలుల ముప్పు
- ఏటా మార్చి, ఏప్రిల్‌లో ఉద్యాన పంటలను దెబ్బతీస్తున్న వైనం
- భారీగా నష్టపోతున్న రైతులు
అనంతపురం అగ్రికల్చర్ : సూర్య ప్రతాపం కొనసాగుతోంది. మండే ఎండల నడుమే మూడు రోజుల కిందట అకాల వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే సందర్భంలో ఉరుములు, పిడుగులు, వడగళ్లతో కూడిన వానలతో పాటు పెనుగాలుల ముప్పు పొంచి ఉంది. ఇవి ఉన్నట్లుండి ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదముంది. ఏటా వేసవి ప్రారంభం కాగానే అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లు పండ్లతోటల రైతులను భయపెడుతున్నాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంటోంది. అరటి, బొప్పాయి, మామిడి, మునగ, కర్భూజా, కళింగర, దోస, ఆకు, వక్క తోటలతో పాటు పాలీహౌస్, షేడ్‌నెట్స్, ఉద్యాన నర్సరీలు, టమాట లాంటి కూరగాయల పంటలకు నష్టం వాటిల్లుతోంది.
కాపునకు వచ్చిన, కోతకు సిద్ధంగా ఉన్న తోటలు నేలవాలడం, మామిడి, సపోటా, చీనీ కాయలు రాలిపోవడం, రూ.లక్షల పెట్టుబడులతో నిర్మించుకున్న పాలీహౌస్‌లు, షేడ్నెట్లు కూలిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యాన రైతులతోపాటు విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. విపరీతమైన గాలులుకు కరెంటు స్తంభాలు కూలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు దెబ్బతింటున్నాయి. పెద్దఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవించిన దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. వ్యవసాయ, ఉద్యాన, ఇతర అనుబంధ రంగాలతో పాటు విద్యుత్‌శాఖ, ఇతరత్రా వాటికి జరిగే నష్టం ప్రతియేటా ఎంతలేదన్నా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటోంది. ఏటా అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. ఈ సమస్యను అధిగమించడానికి చర్యలు చేపట్టడంలో ఉద్యానశాఖతో పాటు జిల్లా యంత్రాంగం వైఫల్యం చెందుతోంది.
ఆపద సంభవించిన సమయంలో మాత్రం ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల వరకు అందరూ హడావుడి చేస్తున్నారు. నష్టపోయిన రైతులను కంటితుడుపుగా ఓదార్చడం మినహా పరిహారం ఇచ్చి ఆదుకున్న సందర్భాలు చాలా తక్కువ. గతంలో జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటికీ పండ్లతోటల రైతులకు పరిహారం రాని పరిస్థితి ఉంది. 2011 సంవత్సరంలో 250 ఎకరాలు, 2012లో 190 ఎకరాలు, 2013లో 910 ఎకరాలు, 2014లో 780 ఎకరాలు, 2015లో 510 ఎకరాలు, 2016లో 230 ఎకరాల్లో అరటి, బొప్పాయి, చీనీ, మామిడి, సపోటా, కూరగాయలు తదితర పంటలు దెబ్బతినడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఈసారి కూడా పండ్లతోటల రైతుల్లో గుబులు రేగుతోంది. నష్ట నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఆత్మకూరులో భారీ వర్షం
జిల్లాలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయితే.. గాలివేగం తక్కువగా ఉండటంతో పంట నష్టం పెద్దగా జరగలేదు. దీంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆత్మకూరు మండలంలో ఏకంగా 63 మిల్లీమీటర్ల (మి.మీ) భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. కదిరిలో 38 మి.మీ, డి.హీరేహాళ్ 25, బొమ్మనహాళ్ 21, బ్రహ్మసముద్రం 16, అగళి 15, కణేకల్లు 14, ఉరవకొండ 14, రాయదుర్గం 13, విడపనకల్లు 12, రాయదుర్గంలో 11 మి.మీ మేర వర్షపాతం నమోదైంది.
శెట్టూరు, బెళుగుప్ప, గుడిబండ, వజ్రకరూరు, గుమ్మఘట్ట, గార్లదిన్నె, కూడేరు, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రొద్దం, గుత్తి, పామిడి, కంబదూరు తదితర మండలాల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి. అకాల వర్షాల కారణంగా జిల్లా అంతటా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం అత్యధికంగా చెన్నేకొత్తపల్లి మండలంలో 38 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 23 డిగ్రీల మధ్య కొనసాగాయి. గాలిలో తేమ శాతం ఉదయం 75 నుంచి 90, మధ్యాహ్నం 25 నుంచి 35 మధ్య నమోదైంది.గాలులు గంటకు 6 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.