వైదిక ధర్మం అనుసరణీయం
గరికపాటి నరసింహారావు
శ్రీకాకుళం కల్చరల్,న్యూస్‌లైన్ : వైదిక ధర్మం ఎంతో గొప్పదని, అందరూ అనుసరించదగ్గదని ప్రముఖ పండితుడు, సహస్రావధాని గరికపాటి నరసింహా రావు అన్నారు. ‘కఠోపనిషత్’పై మూడు రోజులు కొనసాగనున్న ఆయన ప్రవచనాలు పట్టణంలోని ఉపనిషన్మందిరం కమిటీ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మనం పాటించే ఆచారవ్యవహారాల వెనుక ఎన్నో అర్ధాలు ఉన్నాయని నరసింహారావు వివరించారు.
సత్వ, రజో, తమో గుణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. శ్రీరాముడు విశ్వామిత్రునితో కలిసి పయనిస్తూ తమో గుణానికి ప్రతీక అయిన తాటకిని సంహరించాడని, రజో గుణానికి ప్రతిక అయిన అహల్యను సంస్కరించాడని, సత్వగుణానికి ప్రతిక అయిన సీతను భార్యగా స్వీకరించాడని తెలిపారు. మన వేదాంతం అంతా అరచేతిలో ఉందని వివరించారు. జీవుడు దేవునితో కలవడమే చివరకు జరగాలని అన్నారు. ఎవరైనా.. ఏమైనా మాట్లాడదలచినపుడు సమాజంపై ప్రేమతో మాట్లాడాలని సూచించారు.
ప్రస్తుత సమాజంలో ఒత్తిడి పెంచుకొని రోగాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నచికేతనుడు చేసిన సాహసమే కఠోపనిషత్ సారాంశమన్నారు. ముందుగా గరికపాటి నరసింహారావును మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సత్కరించారు. ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, డీసీఎంఎస్ చెర్మైన్ గొండు కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు శిమ్మ రాజశేఖర్, కె.ఎల్ .ప్రసాద్, అబ్దుల్ రహమాన్, టీడీపీ నేతలు గుమ్మా నాగరాజు, జామి భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు.