చంద్రబాబువే చీకటి ఒప్పందాలు : కల్పన
పామర్రు రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబువన్నీ చీకటి ఒప్పందాలేనని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన విమర్శించారు. రాత్రివేళ కేంద్రమంత్రి చిదంబరాన్ని కలుస్తూ, పగటివేళ సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షను బలవంతంగా భగ్నం చేసినంత మాత్రాన రాష్ట్ర విభజనపై తమ పార్టీ అభిప్రాయం, నిర్ణయంలో మార్పు ఉండదనే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ జైలులోనే జననేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దీక్ష చేపట్టారని తెలిపారు. ఆయన దీక్షపై ఎల్లో మీడియా దుష్ర్పచారారం చేస్తోందని విమర్శించారు. విజయమ్మ, జగన్మోహన్రెడ్డి దీక్షలను విమర్శించే అర్హత రెండుకళ్ల సిద్ధాంతం ప్రదర్శించే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలకు లేదని ఎద్దేవాచేశారు.
వర్లా... నిజాలు తెలుసుకుని మాట్లాడు
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, భారతి బెంగళురు నుంచి ఢిల్లీకి వెళ్లారని విమర్శించిన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యపై కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు ఢిల్లీ వెళ్లడం చూశావా అని ప్రశ్నించారు. నిజమైన సమైక్యవాదివి అయితే రాష్ట్ర విభజన వద్దంటూ చంద్రబాబుతో ప్రకటన చేయించాలని వర్లను డిమాండ్‌చేశారు. విజయమ్మ, జగన్మోహన్రెడ్డి, షర్మిలపై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు.
వర్లరామయ్య జిల్లాలో ఉద్యోగం చేసిన సమయంలో ఎంతటి నీతి, నిజాయితీగా వ్యవహరించారో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవాచేశారు. విజయమ్మపై విమర్శలుచేసిన మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తంచేశార. దొంగనాటకాలు మానుకోవాలని హితవు పలికారు. పామర్రు ఉపసర్పంచి ఆరేపల్లి శ్రీనివాసరావు, పీఏసీఎస్ డెరైక్టర్ మోరా రాజారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు ముత్తేవి ప్రసాద్, కుంపటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.