సింహపురి సివిల్స్ తేజాలు
సింహపురిలో ప్రతిభావంతులకు కొదవలేదనే విషయాన్ని గురువారం వెల్లడైన యూపీఎస్సీ ఫలితాలు మరోసారి నిరూపించాయి. జిల్లాలోని వెంకటగిరి వాసి వంశీకృష్ణ 103, నెల్లూరుకు సమీపంలోని గుడిపల్లిపాడుకు చెందిన అంచిపాక సునీల్ 426, నాయుడుపేట నివాసి ఎద్దల బాలాజీకిరణ్ 846వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. వీరిలో వంశీకృష్ణ డెంటిస్ట్. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ రేసులో నిలిచారు. దివంగత ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం స్వగ్రామం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన సునీల్ మె రుగైన ర్యాంకు సాధించడం విశేషం. నాయుడుపేట నివాసి బాలాజీకిరణ్ సైతం ప్రతిభ కనబరి చారు. ఈ ముగ్గురూ జిల్లా యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
ఒక యువకుడు కలలు కన్నాడు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు కఠోర శ్రమ చేశాడు. శ్రమ వృథాకాలేదు. లక్ష్యాన్ని సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆ యువకుడే వెంకటగిరికి చెందిన దంతవైద్యుడు కోనా వంశీకృష్ణ. విద్యార్థుల జీవితాశయమైన సివిల్స్‌లో మొదటి ప్రయత్నంలోనే 103వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికై జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు.
వెంకటగిరిటౌన్ : వెంకటగిరికి చెందిన కోనా వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమారుడు వంశీకృష్ణ. వెంకటేశ్వరరావు పట్టణంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. తన కుమారుడు వంశీకృష్ణను చదువులో రాణిస్తుండటం తో ప్రోత్సహించేవారు. వంశీకృష్ణ పట్టణంలోని సెయిం ట్ ఫ్రాన్సిస్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. తిరుపతిలో వికాస్ జూ నియర్ కళాశాలలో ఇంటర్ (బైపీసీ) పూర్తి చేశారు. అనంతరం నెల్లూరు నారాయణ వైద్యశాలలో దంతవైద్య కోర్సులో చేరి గోల్డ్‌మెడల్ సాధించారు. వంశీకృష్ణ తమ్ముడు సాయి బి.టెక్ పూర్తి చేశాడు.
ఏదో సాధించాలనే తపనతో..
డెంటిస్ట్‌గా వంశీకృష్ణ సంతృప్తి చెందలేదు. జీ వితంలో ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల అతనిలో రోజురోజుకూ పెరిగాయి. బిడ్డ ఆశయాన్ని, లక్ష్యాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వంశీకృష్ణను వెన్నుతట్టి ప్రోత్సహించారు. డెంటిస్ట్‌గా తక్కువ మందికి సేవచేసే అవకాశం ఉంటుందని భావించి ఐఏఎస్ సాధించాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని వాజీరామ్ అండ్ రవి ఐఏఎస్ అకాడమీలో సివిల్స్‌కు 16 నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. గురువారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 103వ ర్యాంక్ సాధించారు.తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి యువతకు ఆదర్శంగా నిలిచారు.
పలువురు అభినందనలు
వంశీకృష్ణ జాతీయస్థాయి పరీక్షల్లో ప్రతిభచూపడంతో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు అభిందనలు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ విశ్రాంత రీజనల్ డెరైక్టర్ నాగం శేషమనాయుడు సివిల్స్ విజేత వంశీకృష్ణ ఇంటికి వచ్చి కేక్ తినిపించి అభినందనలు తెలిపారు. అలాగే పలువురు ప్రముఖులు ఫోన్‌ద్వారా అభినందించారు.
లక్ష్యంను సాధించేందుకు శ్రమే మార్గం
పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు. మారుమూల గ్రామాల్లో ప్రతిభగల విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వారిలో యూపీఎస్సీ, గ్రూప్స్ పంటి పరీక్షలపై అవగాహన లేదు. జాతీయస్థాయి పరీక్షలకు ఎంపిక కాలేమన్న భావన విడనాడాలి. ఆశావహ దృక్పథం అలవరుచుకోవాలి. ప్రతిరోజూ 12 గంటలు కష్టపడి చదివితే విజయం సాధించవచ్చు. యూపీఎస్సీ పరీక్షకు హాజరుకావాలనే ఆశయం ఉన్నవారు నన్ను సంప్రదిస్తే తప్పక సలహాలు అందిస్తాను. వెంకటగిరిలో ఉన్నప్పుడల్లా వారి అనుమానాలను నివృత్తి చేసి దిశా నిర్దేశం చేస్తాను.
కె వంశీకృష్ణ