యూపీవీసీ విండోల విభాగంలోకి సుధాకర్ పైప్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పీవీసీ పైపుల తయారీలో ఉన్న సుధాకర్ పైప్స్ యూపీవీసీ కిటికీల విభాగంలోకి ప్రవేశించింది. జర్మనీకి చెందిన ఆలూప్లాస్ట్ భాగస్వామ్యంతో వీటి తయారీ చేపడుతున్నట్టు సుధాకర్ గ్రూప్ చైర్మన్ మీల సత్యనారాయణ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్లోని నాచారం వద్ద రూ.5 కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేశామన్నారు. ప్లాంటులో రోజుకు 100కు పైగా కిటికీలను తయారు చేస్తామన్నారు. యూపీవీసీకి ఆదరణ పెరుగుతోందని సుధాకర్ మార్కెటింగ్ ఏజెన్సీస్ డెరైక్టర్ మీల సంజయ్ తెలిపారు.
ఆలూప్లాస్ట్తో కలసి భవిష్యత్తులో తయారీ ప్లాంటు పెట్టే ఆలోచన ఉందని సుధాకర్ పైప్స్ ఎండీ మీల జయదేవ్ వెల్లడించారు. రూ.50 కోట్లతో కేబుల్స్ తయారీ ప్లాంటు సైతం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పారిశ్రామిక విధానంలో స్పష్టత వచ్చాకే ప్లాంటు ఎక్కడ నెలకొల్పేది వెల్లడిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకంలో పాల్గొం టామని చెప్పారు. నిర్మాణ రంగంలో అనిశ్చితితో పైపుల వినియోగం తగ్గిందని తెలిపారు.