Uranium Corporation of India Ltd (UCIL)
-
భూగర్భ జలాల అధ్యయనం; ప్రభుత్వం కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యర్థాల వల్ల భూగర్బజలాలు కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర తనిఖీ, అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రభుత్వ నిపుణుల కమిటీని నియమించింది. యురేనియం కార్పొరేషన్ వ్యర్థాలు నిల్వచేస్తున్న పాండ్, దాని చుట్టుపక్కల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయా.. లేదా అన్న విషయంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఇక నిపుణుల కమిటీలో సభ్యులుగా ఎన్జీఆర్ఐ, జియాలజీ, ఏపీ ప్రభుత్వ భూగర్భ జల విభాగం, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఏపీ మైన్స్ మరియు జియాలజీ విభాగం, రాష్ట్ర వ్యవసాయశాఖ, తిరుపతి ఐఐటీ నుంచి నిపుణులను నియమించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ విషయంపై సత్వరమే నివేదిక అందించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడురోజుల్లోగా నియామకాలు పూర్తిచేసి...10 రోజుల్లోగా కమిటీ నివేదిక అందించనుంది. కాగా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రమాణాలను పాటించడంలేదని, టెయిల్ పాండ్ నిర్మాణంలో సరైన డిజైన్, ప్రణాళిక లేదంటూ జూన్ 21,2018లో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ కె.బాబురావు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన బోర్డు సదరు సంస్థకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. అయితే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బోర్డు మార్గదర్శకాలను పట్టించుకోకపోగా.. తాము ఇదివరకు తీసుకున్న చర్యలు సరిపోతాయని తెలిపింది. దీంతో ఆగస్టు 7న బోర్డు షోకాజ్ నోటీసు జారీచేసింది. తాజాగా ఈ విషయమై ప్రభుత్వం ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. -
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాలను నిలిపేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం పులులకు నివాస యోగ్యమైందని, చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు పర్యావరణాన్ని నాశనం చేసే తవ్వకాల అనుమతులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ తవ్వవకాలతో వేలాది మంది చెంచుల కుంటుబాలు అటవీ ప్రాంతం వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాల వల్ల ఏర్పడే వాయు కాలుష్యంతో కేన్సర్ వ్యాధులు సోకడంతోపాటు జంతు జాతులు నాశనమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. మన్ననూర్, పదిర, దేవరకొండ, నాగార్జునసాగర్ ప్రాంతంలోని లంబాపూర్‌లో తవ్వకాలకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఉందని వివరించారు. యురేనియం తవ్వకాలకు సంబంధించిన అనుమతులను వెంటనే రద్దు చేసి ఆయా ప్రాంతాల్లో నివసించే అటవీ జాతులను, పర్యావరణాన్ని కాపాడాలని లేఖలో కోరారు. -
యురేనియం బాధితులకు ఊరట
సాక్షి, కడప : వేముల మండలంలోని యురేనియం ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారానికి వీలుగా గ్రీవెన్స్ కమిటీ పునరుద్ధరణకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) అధికారులు అంగీకరించారు. తరచూ గ్రీవెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించి కాలుష్యం, భూసేకరణ, ఉద్యోగాలు తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవతో మంగళవారం కలెక్టర్ సమక్షంలో యూసీఐఎల్ సీఎండీ, ప్రభావిత గ్రామాల ప్రజలతో సమావేశం జరిగింది. యూసీఐఎల్ పరిధిలోని కేకే కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లె, భూమాయపల్లె ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవినాష్‌రెడ్డి వివరించారు. టెయిలింగ్ పాండ్‌లోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని తెలిపారు. ఇందువల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని చెప్పారు. కలుషిత జలాలు సేవించడం వల్ల పశువులు చనిపోతున్నాయని, ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. కొంతమంది బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. పలువురికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 126 ఎకరాల భూమిని సేకరించాలన్నారు. ఇలాంటి సమస్యలను తెలుసుకుని సకాలంలో పరిష్కరించేందుకు గతంలో గ్రీవెన్స్ కమిటీ సమావేశాలు తరుచూ జరిగేవని పేర్కొన్నారు. ఐదారేళ్లుగా ఈ ఆనవాయితీకి యూసీఐఎల్ అధికారులు స్వస్తి చెప్పడం దురదృష్టకరమన్నారు. కేకే కొట్టాలలో ఏడాదిన్నరగా ప్రజలు కాలుష్యం బారిన పడి అల్లాడుతున్నారని తెలిపారు. గ్రీవెన్స్ కమిటీ తక్షణమే పునరుద్ధరించి బాధిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇందుకు యూసీఐఎల్ సీఎండీ అంగీకరించారు.నెలాఖరులోపు కమిటీని పునరుద్ధరించి తరుచూ సమావేశాలు నిర్వహించడం ద్వారా అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు పంట నష్టపరిహారమివ్వాలి కాలుష్యం కారణంగా పంట నష్టపోయిన అరటి రైతులకు పరిహారం ఇవ్వాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఆరోగ్య పరిరక్షణకు తరచూ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. దీనికి కూడా సంస్థ అధికారులు సమ్మతించారు. టెయిలింగ్‌పాండ్ నుంచి రివర్స్ పంపింగ్‌కు సహకరించాలని యూసీఐఎల్ అధికారులు కోరారు. బా«ధిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తేనే తాము సహకరిస్తామని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో పైపులైన్ల ద్వారా రక్షిత తాగునీటి సరఫరా చేస్తామని గతంలో ఇచ్చిన హామీని యూసీఐఎల్ నిలబెట్టుకోవాలని కోరారు. అందుకు యూసీఐఎల్ అధికారులు ఆమోదం తెలిపారు. యురేనియం తవ్వకాల వల్ల భూమిలో నుంచి వెలువడుతున్న తెల్లటి దుమ్ము పంటలను ఆవరించి నష్టపరుస్తోందని రైతులు ఈ సందర్భంగా చెప్పారు. పంటలపై పేరుకుపోతున్న వైట్ పౌడర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, అక్కడి భూముల్లో ఉన్న ఖనిజాల వల్లే పంటలు కలుíషితంగా మారి దెబ్బతింటున్నాయని యూసీఐఎల్ అధికారులు బదులిచ్చారు. ఇందుకు వైఎస్ అవినాష్ రెడ్డి అభ్యంతరం చెబుతూ గతంలో ఎన్నడూ లేని ఇలాంటి సమస్య యురేనియం ప్లాంటు ఏర్పాటు చేసిన తర్వాతనే ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన విధంగా 360 హెక్టార్లలో యూసీఐఎల్ మొక్కలు నాటాల్సి ఉన్నా ఆ పని ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు.టెయిలింగ్‌పాండ్ వ్యర్థాలు భూమిలోకి దిగుతున్న విషయాన్ని తెలుసుకునేందుకు మానిటరింగ్ వెల్స్‌ను యూసీఐఎల్ అధికారులు పరిశీలించడం లేదని ఎంపీ అన్నారు. శ్యాంపిల్స్ కూడా సేకరించడం లేదని చెప్పారు. రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పనులు కూడా చేపట్టడం లేదన్నారు. గతంలో 200 అడుగుల లోతులో ఉన్న భూగర్బ జలం యూసీఐఎల్ వచ్చాక 1000 నుంచి 1500 అడుగుల్లోకి వెళ్లిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేకే కొట్టాల గ్రామ ప్రజలు కోరుతున్న విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పబ్లిక్ హియరింగ్ నిర్వహించిన తర్వాత చర్యలు తీసుకుంటామని యూసీఐఎల్ అధికారులు అన్నారు. కాలుష్యాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఓ అధికారిని ఇక్కడికి డెప్యూట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని అవినాష్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ సమావేశంలో యూసీఐఎల్ సీఎండీ సీకే అస్నాని, డి(టి)ఎస్ఆర్ ప్రణేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏకే సారంగి, జనరల్ మేనేజర్ ఎంఎస్ రావు, డీజీఎంఎస్ ఎస్కే శర్మ, యూకే సింగ్, మేనేజర్ సంజయ్చటర్జీ తదితరులు పాల్గొన్నారు. -
గరుడ వేగ సినిమా ప్రదర్శించొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో రాజశేఖర్ నటించిన ‘పీయస్వీ గరుడ వేగ’ చిత్రాన్ని ప్రదర్శించరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గరుడ వేగ సినిమాపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారించిన సివిల్ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దంటూ దర్శకనిర్మాలతో పాటు, యూట్యూబ్‌కు కోర్టు నోటీసులు పంపింది. అసలేం జరిగింది? గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు నాల్గవ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సదరు సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు.. ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ స్కాంను ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ పాత్రధారుడిగా హీరో వెలికి తీసినట్టు చూపారని లాయర్ పేర్కొన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీంతో పిటిషనర్ వాదనలను పరిశీలించిన జడ్జి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేశారు. చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు గతేడాది నవంబరులో వచ్చిన గరుడ వేగ మంచి విజయం అందించిన విషయం తెలిసిందే . సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు రావడం గమనార్హం. -
పులివెందులలోని యూసీఐఎల్‌కు సమైక్య సెగ
సమైక్యాంధ్ర ఉద్యమానికి పులివెందుల యురేనియం ప్లాంట్ (యూసీఐఎల్) లోని ఉద్యోగులు తమ సంఘీభావం ప్రకటించారు. నేటి నుంచి 72 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చామని... అందుకు సంబంధించి ప్లాంట్ సీఎండీ బెహల్తోపాటు ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు పులివెందుల సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు గురువారం ఇక్కడ వెల్లడించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. యూసీఐఎల్ కార్యకలాపాలను స్తంభింపజేయడం ద్వారా ఉద్యమ ప్రభావ తీవ్రత కేంద్రానికి తెలపాలని నిర్ణయించినట్లు వారు తెలియజేశారు. ప్రస్తుతం 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చామని .. మార్పు రాకపోతే నిరవధికంగా మైనింగ్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని వారు హెచ్చరించారు. మైనింగ్‌తోపాటు ఇతర కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన అన్ని పనులను నిలిపివేసేలా ఉద్యోగ సంఘాలతోపాటు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించామని వారు తెలిపారు.