సమైక్యాంధ్ర ఉద్యమానికి పులివెందుల యురేనియం ప్లాంట్ (యూసీఐఎల్) లోని ఉద్యోగులు తమ సంఘీభావం ప్రకటించారు. నేటి నుంచి 72 గంటలపాటు బంద్కు పిలుపునిచ్చామని... అందుకు సంబంధించి ప్లాంట్ సీఎండీ బెహల్తోపాటు ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు పులివెందుల సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు గురువారం ఇక్కడ వెల్లడించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
యూసీఐఎల్ కార్యకలాపాలను స్తంభింపజేయడం ద్వారా ఉద్యమ ప్రభావ తీవ్రత కేంద్రానికి తెలపాలని నిర్ణయించినట్లు వారు తెలియజేశారు. ప్రస్తుతం 72 గంటల బంద్కు పిలుపునిచ్చామని .. మార్పు రాకపోతే నిరవధికంగా మైనింగ్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని వారు హెచ్చరించారు. మైనింగ్తోపాటు ఇతర కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన అన్ని పనులను నిలిపివేసేలా ఉద్యోగ సంఘాలతోపాటు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించామని వారు తెలిపారు.