వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లెలో భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
అభిమాన నేతను చూసేందుకు తరలివచ్చిన పల్లె ప్రజానీకం
తాతిరెడ్డిపల్లె రామాలయం విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వైఎస్ జగన్
దారి పొడవునా రోడ్డుపైకి ఊళ్లకు ఊళ్లు తరలి వచ్చిన వైనం
30 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా 6 గంటల సమయం
అనారోగ్యంతో ఉన్న అనుచరులకు ఆత్మీయ పలకరింపు
కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు
కుటుంబ సభ్యులతో కలిసి కేట్ కట్ చేసిన మాజీ సీఎం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పులివెందుల–తాతిరెడ్డిపల్లె మార్గంలోని పల్లెల జనమంతా బుధవారం రోడ్డుపైకి వచ్చేశారు.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. తమ అభిమాన నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు.. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వారి అభిమానానికి ముగ్దుడైన వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో రామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు 11 గంటలకు బయలుదేరారు. అడుగడుగునా అభిమాన జనం పోటెత్తడంతో 30 కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు ఏకంగా ఆరు గంటలు పట్టింది. ప్రతి గ్రామం వద్ద రోడ్డుపైకి వచ్చిన ప్రజలు వైఎస్ జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు.
ఆయనతో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. సాయంత్రం ఐదు గంటలకు ఆలయం వద్దకు వచ్చే సరికి ఆ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసింది. వైఎస్ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కోదండరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ మూర్తులకు పట్టు వ్రస్తాలు సమర్పించారు. కాగా, ఈ ఆలయానికి వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.34 లక్షలు మంజూరు చేశారు.
పేరు పేరునా ఆత్మీయ పలకరింపు
తాతిరెడ్డిపల్లెకు బయలు దేరిన మాజీ సీఎం వైఎస్ జగన్.. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కర్నపాపాయపల్లెలో నాగశేషులరెడ్డి కన్పించలేదు. ఆయన గురించి వాకబు చేయడంతో అనారోగ్యంతో ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. అప్పటికప్పుడు నాగశేషులరెడ్డి ఇంటికి వాహనాన్ని మళ్లించారు.
ఆయన్ను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. లింగాలలో సీనియర్ నాయకుడు కొండారెడ్డి కన్పించక పోవడంతో వాహనం దిగి, ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. ఆరోగ్య వివరాలు కనుక్కున్నారు. ఇలా ప్రతి గ్రామంలో నేతలను పేరు పేరునా పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సినీ నటుడు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో వైఎస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. పెద్దనాన్న వైఎస్ శివప్రకాష్‌రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, పెద్దమ్మ వైఎస్ భారతమ్మతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహార్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ జగన్ సతీమణీ వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ 2025 కేలండర్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment