వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ భరోసా
బంధువుల యోగక్షేమాలు తెలుసుకున్న జగన్
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం పులివెందులలో పార్టీ శ్రేణులు, అభిమానులతో మమేకమయ్యారు. ఉదయం 9.15 గంటల నుంచి ఆయన పులివెందుల క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులకు అందుబాటులో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.
ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరుల వెంట వెళ్లిన కేడర్‌కు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు సూచనలు చేశారు.
ఆపన్నులకు అండగా
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలు విరిగిన ఇప్పట్ల గ్రామానికి చెందిన శ్రుతిలయ తన దీననగాథను కుటుంబ సభ్యుల ద్వారా వివరించారు.
ఆర్థికంగా కుటుంబం చితికిపోయిందని వారు జగన్ వద్ద వాపోయారు. అదేవిధంగా కడపకు చెందిన ముస్లిం మైనార్టీ దంపతులు వారి కుమార్తె అనారోగ్యాన్ని వివరించి, వైద్య సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన జగన్ అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీ అవినాష్‌రెడ్డిని ఆదేశించారు.
పెద్దనాన్నతో కాసేపు..
వయోభారంతో ఉన్న పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి ఇంటికి వైఎస్ జగన్ బుధవారం వెళ్లారు. ఆయనతో కొంతసేపు ముచ్చటించారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగిన సూచనలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డితో పాటు ఇతర బంధువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
నూతన జంటలకు ఆశీర్వాదం
ఇటీవల వివాహాలైన నూతన జంటలను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. సమీప బంధువు శ్రీధర్‌రెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, శ్రీనిజ జంటను ఆశీర్వదించారు. దొండ్లవాగు వైఎస్సార్‌సీపీ నాయకుడు విద్యానందరెడ్డి సోదరి వివాహం ఇటీవల జరిగింది. విద్యానందరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ నూతన జంట మాధురి, నరేంద్రరెడ్డిని ఆశీర్వదించారు. అక్కడే ఉన్న వారి బంధువర్గాన్ని పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment