పులివెందుల పర్యటన సందర్భంగా బ్రహ్మరథం పట్టిన ప్రజలు
ప్రతి గ్రామంలో వాహనం ఆపి స్థానికులను పలకరించిన వైఎస్ జగన్
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జగన్ కోసం దారిపొడువునా వేచి ఉన్న ప్రజానీకం
కడప నుంచి పులివెందుల చేరుకునేందుకు 9 గంటల సమయం
ఇటీవల మరణించిన మాచునూరు చంద్రారెడ్డి కుటుంబానికి పరామర్శ
గొందిపల్లెలో నూతన జంటకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల పర్యటనకు వచ్చి న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన రాక కోసం రహదారి వెంబడి గంటల తరబడి వేచి ఉండి అపూర్వ స్వాగతం పలికారు.
వైఎస్ జగన్ సైతం గ్రామ గ్రామానా ప్రజానీకంతో మమేకం అవుతూ, వారిని పలుకరిస్తూ ముందుకు కదిలారు. ఎక్కడ కూడా ఇసుమంతైనా విసుగు లేకుండా ప్రజలతో సెల్ఫీలు దిగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేపథ్యంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పులివెందులకు వచ్చారు.
వైఎస్సార్ జిల్లా కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల చేరుకునేందుకు ఆయనకు 9 గంటల సమయం పట్టింది. ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వచ్చిన వైఎస్ జగన్ రాత్రి 8.30 గంటలకు పులివెందులకు చేరుకున్నారు. తొలుత తోళ్లగంగనపల్లె వద్దకు పెద్దఎత్తున చేరుకున్న ప్రజానీకం పలకరింపుతో మొదలైన పర్యటన పులివెందుల వరకూ కొనసాగింది.
అండగా ఉంటా.. అధైర్యపడొద్దు
కడప నుంచి మాచునూరుకు వెళ్లిన వైఎస్ జగన్.. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ మండలశాఖ అధ్యక్షుడు మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీకి ఆ కుటుంబం అందించిన సేవలు గుర్తున్నాయని, దివంగత మాచునూరు చంద్రారెడ్డి తనకు అండగా నిలిచారని, ఆయన కుటుంబానికి అండగా ఉంటాను, అధైర్యపడొద్దని మాచునూరు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
వైఎస్ జగన్‌ను చూడగానే చంద్రారెడ్డి సతీమణీ లక్ష్మీనారాయణమ్మ బోరున విలపించారు. ఆమెను ఓదార్చిన జగన్.. ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా చేరదీసి చంద్రారెడ్డి సేవలు గుర్తుచేసుకున్నారు. చంద్రారెడ్డి కుమారులు పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి, కోడలు, పెండ్లిమర్రి ఎంపీపీ వరలక్ష్మిలను పలకరించి.. అధైర్యపడొద్దు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు.
నూతన జంటకు ఆశీస్సులు
ఇటీవల వివాహమైన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రహాసరెడ్డి కుమార్తె, అల్లుడికి వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేశారు. చంద్రహాసరెడ్డి స్వగ్రామం గొందిపల్లెలో నూతన జంట ఆశా, శివారెడ్డిలకు వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న వివిధ గ్రామాలకు చెందిన నాయకులను పేరుపేరునా పలుకరించి, ఫోటోలు దిగారు.
ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
కడప ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ దాసరి సు«ధ, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు జగన్‌కు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment