urban ladder
-
రిలయన్స్ చేతికి అర్బన్ ల్యాడర్
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ పెట్టుబడుల జైత్రయాత్ర కొనసాగుతోంది. రిటైల్ రంగంలో మరింత విస్తరించడమే లక్ష్యంగా ఆన్లైన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ అర్బన్ ల్యాడర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన రిటైల్ విభాగం చేజిక్కించుకుంది. ‘అర్బన్ ల్యాడర్ హోమ్ డెకార్ సొల్యూషన్స్ లిమిటెడ్‌లో 96 శాతం వాటాను రిలయన్స్ అనుబంధ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) కొనుగోలు చేసింది. దీనికోసం రూ.182.12 కోట్లను చెల్లించాం’ అని ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మిలిగిన వాటాను కూడా కొనుగోలు చేసే (100 శాతానికి) అవకాశం తమకు ఉందని వెల్లడించింది. కాగా, 2023 డిసెంబర్ నాటికల్లా అర్బన్ ల్యాడర్‌లో ఆర్ఆర్వీఎల్ మరో రూ.75 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నట్లు కూడా ఆర్ఐఎల్ తెలిపింది. ఈ కొనుగోలుకు ప్రభుత్వ, నియంత్రణపరమైన అనుమతులేవీ తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. ఈ–కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలతో పోటపోటీగా తమ వినియోగదారులకు మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఆర్ఐఎల్కు ఈ తాజా కొనుగోలు దోహదం చేయనుంది. కాగా, ఆర్ఆర్వీఎల్లో పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజ సంస్థలకు వాటా విక్రయాల ద్వారా గడిచిన రెండు నెలల్లో ఆర్ఐఎల్ రూ.47,265 కోట్ల భారీ నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్ఆర్వీఎల్ విలువ రూ.4.58 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 12,000 స్టోర్లు ఉన్నాయి. -
అర్బన్ ల్యాడర్‌పై ఆర్ఐఎల్ కన్ను!
ఈకామర్స్‌లో వ్యాపార విస్తరణకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసుకునే యోచనలో ఉన్న ఆర్ఐఎల్ దేశీయంగా మరికొన్ని కంపెనీల కొనుగోలుకి చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఆన్లైన్ ఫర్నీచర్ కంపెనీ ఆర్బన్ ల్యాడర్‌పై దృష్టిపెట్టినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇదే విధంగా మిల్క్ డెలివరీ సంస్థ మిల్క్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేసింది. తుది దశలో అర్బన్ ల్యాడర్‌తో కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అర్బన్ ల్యాడర్‌తో 3 కోట్ల డాలర్లు(రూ. 225 కోట్లు) డీల్ కుదిరే వీలున్నట్లు అంచనాలున్నాయి. కాగా.. మరోవైపు ఈఫార్మసీ స్టార్టప్ నెట్మెడ్స్తోపాటు.. లింగరీ రిటైలర్ జివామీలోనూ మెజారిటీ వాటా కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆర్ఐఎల్వైపు చూపు! మిల్క్‌బాస్కట్ గతంలో ఆన్లైన్ గ్రోసరీస్ సంస్థ బిగ్బాస్కెట్తోపాటు.. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌తో నిర్వహించిన చర్చలు విఫలమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తాజాగా ఆర్ఐఎల్ ప్రతినిధులతో మిల్క్‌బాస్కట్ సంప్రదింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడంతో ఇందుకు వేచిచూసే ధోరణితో మిల్క్‌బాస్కట్ ఉన్నట్లు మీడియా పేర్కొంది. 1.5 కోట్ల డాలర్ల విలువను మిల్క్‌బాస్కట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 కారణంగా ఇటీవల మిల్క్ ప్రొడక్టులతోపాటు.. గ్రోసరీస్‌కు సైతం డిమాండ్ పెరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ వ్యాపార విస్తరణకు పలు అవకాశాలు లభిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
ఆన్‌లైన్‌లోనూ ఫర్నిచర్ జోరు
దుస్తులు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్.. ఇవే కాదు ఆన్లైన్ మార్కెట్లో ఫర్నిచర్ కొనేవారి సంఖ్య కూడా పెరిగిందని ఆన్లైన్ ఫర్నిచర్ కంపెనీ అర్బన్ లాడర్ సీఈవో ఆశిష్ గోయల్ తెలిపారు. దీంతో తమ కంపెనీని విస్తరిస్తున్నామని, ప్రస్తుతం హైదరాబాద్‌తోసహా ఆరు నగరాల్లో తమ డెలివరీ సెంటర్లు ఉన్నాయని, 2015కల్లా 25 నగరాలకు విస్తరిస్తామని కంపెనీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కౌస్తబ్ చక్రవర్తి అన్నారు. తమ ఉత్పత్తుల ధరలు దుకాణాల కంటే 15-20% తక్కువని చెప్పారు. ప్రతిరోజూ కంపెనీ వెబ్‌సైట్‌ను 15,000 మంది సందర్శిస్తున్నారు. సరాసరి బిల్లు రూ.20 వేలుందని చెప్పారు. ఎక్స్చేంజ్లో కొనే సౌకర్యాన్ని రెండు నెలల్లో తేనున్నట్టు ఆయన వెల్లడించారు. దుకాణాల్లోకి వెళ్లి ఫర్నిచర్‌ను ప్రత్యక్షంగా చూసి, సోఫా, బెడ్ అయితే కొద్ది సేపు వాటిపై కూర్చుంటేగానీ కస్టమర్లు ఒక అంచనాకు రారని, దాంతో తాము ఒక అడుగు ముందుకేసి ట్రయల్ రూమ్ పేరుతో కస్టమర్ ఇంటికే సోఫాను తీసుకు వచ్చి మరీ చూపిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదీ ఫర్నిచర్ మార్కెట్.. ఫర్నిచర్ మార్కెట్ దేశవ్యాప్తంగా 2013-14లో రూ.80 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఉంది. 13-14 శాతం పరిశ్రమ వృద్ధి చెందుతోంది. వ్యవస్థీకృత రంగంలో మార్కెట్ పరిమాణం రూ.4,000 కోట్లు మాత్రమే. గోద్రెజ్ ఇంటీరియో, జువారీ ఫర్నిచర్, హోమ్ టౌన్, ఎట్ హోమ్, నీల్కమల్, ఇవోక్, డ్యూరియన్, స్టైల్ స్పా, దమ్రో, హౌస్ ఫుల్ వ్యవస్థీకృత రంగంలో ప్రముఖమైనవి. ఇక మొత్తం ఫర్నీచర్ వ్యాపారంలో ఆన్లైన్ వాటా దేశంలో రూ.200 కోట్లు నమోదైంది. 2016 నాటికి ఇది రూ.1,000 కోట్లకు చేరుకుం టుందన్న అంచనాలున్నాయి. పడకలే ఎక్కువ.. ఆన్లైన్లో ఫర్నిచర్ కొనుగోలు విషయంలో హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకత ఉంది. పడకల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నది హైదరాబాదీలేనట. వార్డ్రోబ్లను వెతకడంలో రెండో స్థానం, సోఫాలు సెర్చ్ చేయడంలో మూడో స్థానంలో భాగ్యనగరం నిలిచింది. ఇక హైదరాబాద్ వాసులు ఆన్లైన్లో అధికంగా బెడ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో కాఫీ టేబుల్స్, డ్రాయింగ్ టేబుల్స్ నిలిచాయి.