ఈకామర్స్‌లో వ్యాపార విస్తరణకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసుకునే యోచనలో ఉన్న ఆర్‌ఐఎల్ దేశీయంగా మరికొన్ని కంపెనీల కొనుగోలుకి చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఆన్‌లైన్ ఫర్నీచర్ కంపెనీ ఆర్బన్ ల్యాడర్‌పై దృష్టిపెట్టినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇదే విధంగా మిల్క్ డెలివరీ సంస్థ మిల్క్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేసింది.
తుది దశలో
అర్బన్ ల్యాడర్‌తో కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అర్బన్ ల్యాడర్‌తో 3 కోట్ల డాలర్లు(రూ. 225 కోట్లు) డీల్ కుదిరే వీలున్నట్లు అంచనాలున్నాయి. కాగా.. మరోవైపు ఈఫార్మసీ స్టార్టప్ నెట్‌మెడ్స్‌తోపాటు.. లింగరీ రిటైలర్ జివామీలోనూ మెజారిటీ వాటా కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఆర్‌ఐఎల్‌వైపు చూపు!
మిల్క్‌బాస్కట్ గతంలో ఆన్‌లైన్ గ్రోసరీస్ సంస్థ బిగ్‌బాస్కెట్‌తోపాటు.. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌తో నిర్వహించిన చర్చలు విఫలమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తాజాగా ఆర్‌ఐఎల్ ప్రతినిధులతో మిల్క్‌బాస్కట్ సంప్రదింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడంతో ఇందుకు వేచిచూసే ధోరణితో మిల్క్‌బాస్కట్ ఉన్నట్లు మీడియా పేర్కొంది. 1.5 కోట్ల డాలర్ల విలువను మిల్క్‌బాస్కట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 కారణంగా ఇటీవల మిల్క్ ప్రొడక్టులతోపాటు.. గ్రోసరీస్‌కు సైతం డిమాండ్ పెరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపార విస్తరణకు పలు అవకాశాలు లభిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment