
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ పెట్టుబడుల జైత్రయాత్ర కొనసాగుతోంది. రిటైల్ రంగంలో మరింత విస్తరించడమే లక్ష్యంగా ఆన్‌లైన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ అర్బన్ ల్యాడర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు చెందిన రిటైల్ విభాగం చేజిక్కించుకుంది. ‘అర్బన్ ల్యాడర్ హోమ్ డెకార్ సొల్యూషన్స్ లిమిటెడ్‌లో 96 శాతం వాటాను రిలయన్స్ అనుబంధ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) కొనుగోలు చేసింది. దీనికోసం రూ.182.12 కోట్లను చెల్లించాం’ అని ఆర్‌ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మిలిగిన వాటాను కూడా కొనుగోలు చేసే (100 శాతానికి) అవకాశం తమకు ఉందని వెల్లడించింది. కాగా, 2023 డిసెంబర్ నాటికల్లా అర్బన్ ల్యాడర్‌లో ఆర్‌ఆర్‌వీఎల్ మరో రూ.75 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నట్లు కూడా ఆర్‌ఐఎల్ తెలిపింది.
ఈ కొనుగోలుకు ప్రభుత్వ, నియంత్రణపరమైన అనుమతులేవీ తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. ఈ–కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలతో పోటపోటీగా తమ వినియోగదారులకు మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఆర్‌ఐఎల్‌కు ఈ తాజా కొనుగోలు దోహదం చేయనుంది. కాగా, ఆర్‌ఆర్‌వీఎల్‌లో పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజ సంస్థలకు వాటా విక్రయాల ద్వారా గడిచిన రెండు నెలల్లో ఆర్‌ఐఎల్ రూ.47,265 కోట్ల భారీ నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌ఆర్‌వీఎల్ విలువ రూ.4.58 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 12,000 స్టోర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment