ఆన్‌లైన్‌లోనూ ఫర్నిచర్ జోరు
దుస్తులు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్.. ఇవే కాదు ఆన్‌లైన్ మార్కెట్లో ఫర్నిచర్ కొనేవారి సంఖ్య కూడా పెరిగిందని ఆన్‌లైన్ ఫర్నిచర్ కంపెనీ అర్బన్ లాడర్ సీఈవో ఆశిష్ గోయల్ తెలిపారు. దీంతో తమ కంపెనీని విస్తరిస్తున్నామని, ప్రస్తుతం హైదరాబాద్‌తోసహా ఆరు నగరాల్లో తమ డెలివరీ సెంటర్లు ఉన్నాయని, 2015కల్లా 25 నగరాలకు విస్తరిస్తామని కంపెనీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కౌస్తబ్ చక్రవర్తి అన్నారు. తమ ఉత్పత్తుల ధరలు దుకాణాల కంటే 15-20% తక్కువని చెప్పారు. ప్రతిరోజూ కంపెనీ వెబ్‌సైట్‌ను 15,000 మంది సందర్శిస్తున్నారు. సరాసరి బిల్లు రూ.20 వేలుందని చెప్పారు. ఎక్స్చేంజ్‌లో కొనే సౌకర్యాన్ని రెండు నెలల్లో తేనున్నట్టు ఆయన వెల్లడించారు. దుకాణాల్లోకి వెళ్లి ఫర్నిచర్‌ను ప్రత్యక్షంగా చూసి, సోఫా, బెడ్ అయితే కొద్ది సేపు వాటిపై కూర్చుంటేగానీ కస్టమర్లు ఒక అంచనాకు రారని, దాంతో తాము ఒక అడుగు ముందుకేసి ట్రయల్ రూమ్ పేరుతో కస్టమర్ ఇంటికే సోఫాను తీసుకు వచ్చి మరీ చూపిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ ఫర్నిచర్ మార్కెట్..
ఫర్నిచర్ మార్కెట్ దేశవ్యాప్తంగా 2013-14లో రూ.80 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఉంది. 13-14 శాతం పరిశ్రమ వృద్ధి చెందుతోంది. వ్యవస్థీకృత రంగంలో మార్కెట్ పరిమాణం రూ.4,000 కోట్లు మాత్రమే. గోద్రెజ్ ఇంటీరియో, జువారీ ఫర్నిచర్, హోమ్ టౌన్, ఎట్ హోమ్, నీల్‌కమల్, ఇవోక్, డ్యూరియన్, స్టైల్ స్పా, దమ్రో, హౌస్ ఫుల్ వ్యవస్థీకృత రంగంలో ప్రముఖమైనవి. ఇక మొత్తం ఫర్నీచర్ వ్యాపారంలో ఆన్‌లైన్ వాటా దేశంలో రూ.200 కోట్లు నమోదైంది. 2016 నాటికి ఇది రూ.1,000 కోట్లకు చేరుకుం టుందన్న అంచనాలున్నాయి.
పడకలే ఎక్కువ..
ఆన్‌లైన్‌లో ఫర్నిచర్ కొనుగోలు విషయంలో హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకత ఉంది. పడకల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నది హైదరాబాదీలేనట. వార్‌డ్రోబ్‌లను వెతకడంలో రెండో స్థానం, సోఫాలు సెర్చ్ చేయడంలో మూడో స్థానంలో భాగ్యనగరం నిలిచింది. ఇక హైదరాబాద్ వాసులు ఆన్‌లైన్‌లో అధికంగా బెడ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో కాఫీ టేబుల్స్, డ్రాయింగ్ టేబుల్స్ నిలిచాయి.