నగరమే ఓ వనం!
సిటీల్లో పచ్చదనానికి అర్బన్ లంగ్‌స్పేస్‌లు
శబ్ద.. వాయు.. జల.. ఇలా వివిధ రూపాల్లో కాలుష్యం కోరలు చాస్తోంది. సమస్త మానవాళి మనుగడే ప్రశ్నార్థకం చేస్తోంది. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తోంది. మహానగరాలు, పట్టణాల్లో రోజురోజుకూ చెట్ల శాతం తగ్గిపోతుండటం.. వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో కాలుష్యం భయంకరంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో ప్రకృతి సమతుల్యతను పరిరక్షించేందుకు రాష్ట్రం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ‘‘అర్బన్ లంగ్‌స్పేస్’’ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ప్రజల జీవనానికి ప్రకృతిని అనుసంధానించి నగర వనాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
– సాక్షి, హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా 33,800 హెక్టార్ల విస్తీర్ణంలో 80 వనాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్ణయించింది. హైదరా బాద్‌తోపాటు ఆయా జిల్లాల్లో అర్బన్ లంగ్‌స్పేస్ కోసం ఫారెస్ట్ బ్లాక్‌ల కింద కొంత భూమిని విడిగా కేటాయించనుంది. పట్టణ శివారు ప్రాంతాలకు 4, 5 కి.మీ లోపు ఈ బ్లాక్ లను ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్లాక్ ల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, యోగా షెడ్, పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. మిగతా ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగించనున్నారు.
థీమ్ పార్కులతో కొత్త శోభ..
వీటితో పాటు థీమ్ పార్కులనూ ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కుల్లో డిజర్ట్ గార్డెన్, బ్యాంబు గార్డెన్, రాశి/నక్షత్రవనం, బటర్‌ఫ్లై గార్డెన్, కార్తీక వనం, నవగ్రహ వనం, సప్తర్షి వనం, హెర్బల్ గార్డెన్, అశోక వనం వంటి వాటిని అంతర్భాగంగా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి జిల్లాల పరిధిలో 36 వనాల్లో 7,700 హెక్టార్ల విస్తీర్ణంలో పనులు సాగు తున్నాయి. ఇప్పటివరకు 12 వనాలను ప్రజలకు అందు బాటులోకి తెచ్చారు. వీటిలో దూలపల్లి, నారపల్లి, మేడిపల్లి, నగరం, కండ్లకోయ, రాయగిరి, కేబీఆర్ పార్కు వంటివి ముఖ్యమైనవి. నగరంలోని అన్ని కాలనీలకూ నగర వనాలను అందుబాటులోకి తేవాలనేది అటవీ శాఖ ఉద్దేశం. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో కనీసం 11 జిల్లాల్లో ఈ అర్బన్ లంగ్‌స్పేస్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎన్ని హెక్టార్లలో... 33,800
ఎన్ని వనాలు... 80