Urban Municipal Commissioner
-
హైదరాబాద్‌లో పోడియం పార్కింగ్ !
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లో పోడియం పార్కింగ్‌కు కూడా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భవన నిర్మాణ నియమావళి (జీవో నం.168)కు ఈ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్, ఆపై కొన్ని ఫ్లోర్లను పార్కింగ్ అవసరాలకు తగ్గట్లు నిర్మించుకుని, ఆ తర్వాతి ఫ్లోర్లను నివాస/కమర్షియల్ అవసరాల కోసం నిర్మించుకోవడానికి పోడియం పార్కింగ్ రూల్స్ వీలు కల్పించనున్నాయి. దీంతో అండర్ గ్రౌండ్ పార్కింగ్, పోడియం పార్కింగ్ రెండింటిలో ఏదో ఒక పార్కింగ్ సదుపాయాన్ని ఎంపిక చేసుకుని నిర్మాణాలు చేపట్టడానికి బిల్డర్లు, డెవలపర్లకు అవకాశం కలిగింది. అండర్ గ్రౌండ్‌పై నిషేధం లేదు రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను నిషేధించలేదని, కొత్తగా పోడియం పార్కింగ్ రూల్స్‌ను మాత్రమే అమల్లోకి తెచ్చినట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ రెండు పార్కింగ్ సదుపాయాల్లో ఏదో ఒక దాన్ని బిల్డర్లు, డెవలపర్లు ఎంపిక చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పోడియం పార్కింగ్ రూల్స్ పోడియం ఫ్లోర్ గరిష్ట ఎత్తు 15 మీటర్లు ఉండాలి. భవన నిర్మాణ నియమావళి, అప్రోచ్ రోడ్డు వైశాల్యం ఆధారంగా భవనం ఎత్తు ఉండాలి. పదెకరాలకు పైబడిన స్థలంలో నిర్మించే భవనాల్లో తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ పోడియం ఫ్లోర్లు ఉండాలి. భవనం ఎత్తు, సెట్ బ్యాక్స్ లెక్కించే సమయంలో పోడియం ఫ్లోర్ల ఎత్తును పరిగణనలోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించారు. పోడియం సెట్‌బ్యాక్స్... - 55 మీటర్ల వరకు ఎత్తు గల భవనం విషయం లో 12 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో 7 మీటర్ల సెట్ బ్యాక్ తప్పనిసరి. రెండు పోడియం బ్లాక్‌ల మధ్య అగ్నిమాపక అవసరాలకు వినియోగించే మార్గం (ఫైర్ డ్రైవ్ అవే) 7 మీటర్లు ఉండాలి. - 55 మీటర్లకు మించి ఎత్తు కలిగిన భవనాల విషయంలో 14 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో 7 మీటర్ల సెట్‌బ్యాక్ తప్పనిసరి. పోడియం బ్లాక్‌ల మధ్య అగ్నిమాపక అవసరాలకు వినియోగించే మార్గం (ఫైర్ డ్రైవ్ అవే) 9 మీటర్లు ఉండాలి. - పోడియంపై ఉండే భవనం సెట్ బ్యాక్‌లు బిల్డింగ్ రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. పోడియానికి వదిలిన సెట్‌బ్యాక్‌ను సైతం భవనం సెట్‌బ్యాక్‌లో భాగంగా పరిగణిస్తారు. - పోడియం ఫ్లోర్లను అనుమతిస్తే బేస్మెంట్/సెల్లార్ ఫ్లోర్ల సంఖ్యపై ఆంక్షలు ఉంటాయి. కమర్షియల్ భవనాల విషయంలో మూడు బేస్ మెంట్, నివాస భవనాల విషయంలో రెండు బేస్ మెంట్స్ మాత్రమే అనుమతిస్తారు. - పోడియం సెట్‌బ్యాక్‌లకు సమాన రీతిలో బేస్ మెంట్స్ సెట్‌బ్యాక్స్ ఉండాలి. - పోడియంపై టాట్–లాట్ అనుమతిస్తారు. - భవనం 10 వేల చదరపు మీటర్లలోపు ఫ్లోర్ ఏరియా మాత్రమే కలిగి ఉంటే కనీసం మూడో వంతు భవనంతో పాటు భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం చేరుకునేలా భవనం చుట్టూ సెట్‌బ్యాక్స్ ఉండాలి. - భవనం 10వేల చదరపు మీటర్లకు పైగా ఫ్లోర్ ఏరియా కలిగి ఉంటే కనీసం సగభాగం భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం చేరుకునే విధంగా సెట్‌బ్యాక్స్ ఉండాలి. - పోడియం ఫ్లోర్లను ప్రత్యేకంగా పార్కింగ్ కోసమే వినియోగించాలి. అయితే, విజిటర్స్ లాబీలు, డ్రైవర్ల కోసం వేయిటింగ్ రూమ్స్, టాయిలెట్ల సదుపాయాన్ని కల్పించవచ్చు. విజిటర్స్ లాబీల కోసం గరిష్టంగా 2%, డ్రైవర్లకు సదుపాయాల కోసం గరిష్టం 10 శాతం ఫ్లోర్ ఏరియాను మాత్రమే వినియోగించాలి. - రోడ్డుకు వెళ్లే మార్గం, పోడియం మధ్య ఎలాంటి గోడలు ఉండరాదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్నాక పోడియం పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని వేరే అవసరాల కోసం దుర్వినియోగం చేస్తే, ఆ స్థలాలను సంబంధిత పురపాలిక జప్తు చేసుకుని తన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటుంది. -
కమిషనర్ రాజీనామాతో భగ్గుమన్న షోలాపూర్
- కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించిన రాజకీయ పక్షాలు - మళ్లీ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణ మున్సిపల్ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ రాజీనామా చేయడంతో ఆయా రాజకీయ పక్షాలు బుధవారం షోలాపూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. పట్టణంలో నీటి సరఫరా సక్రమంగా జరగడంలేదని ఆరోపిస్తూ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్కు వ్యతిరేకంగా అధికారపక్ష కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్ పాటించారు. బీజేపీ, శివసేన, బీఎస్పీ, సీపీఎం, ఎమ్మెన్నెస్ తదితర రాజకీయ పార్టీలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. అంతేకాక కమిషనర్‌కు మద్దతు తెలుపుతూ పలు సామాజిక సంఘాలు హుతాత్మ చౌక్‌లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఐదు చోట్ల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మోర్చా నిర్వహించారు. దత్తునగర్, బలిదాన్చౌక్, పంజారాపూల్చౌక్, హుతాత్మచౌక్, కర్నాచౌక్ల నుంచి వేర్వేరుగా ప్రారంభమైన ర్యాలీలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి. తర్వాత అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసి, కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఈ సభలో నర్సయ్య ఆడం మాట్లాడుతూ.. పట్టణంలో తలెత్తుతున్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ శాయశక్తులా కృషిచేస్తున్నారన్నారు. నాందినిలో ఐరన్ ట్యాంకర్ నిర్మించడం, ఎన్టీపీసీ లైన్‌కు తోడుగా మరో పైప్‌లైన్ వేయించడం వంటి పనులను ఆయన చేపట్టారని గుర్తుచేశారు. పట్టణంలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేయడంతో కొందరు కుట్రపూరితంగా కమిషనర్‌ను బయటకు పంపే కుట్రలు పన్నారని, అందులోభాగంగానే ఆయన పనితీరుపై ఆందోళనలు నిర్వహించారన్నారు. కాంగ్రెస్ ఆగడాలకు ఇంతకుముందు పనిచేసిన బిపిన్ మాలిక్, రాజేంద్ర మదనే, రామనాథ్ ఝా వంటి మంచి అధికారులుబేజారై వెళ్లిపోయారరు. పట్టణంలోని రూ.212 కోట్ల డ్రైనేజ్ కాంట్రాక్ట్‌ను కమిషనర్ చంద్రకాంత్ రద్దు చేశారని, ఆ కోపాన్ని మనస్సులో ఉంచుకొని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇలా ఆందోళనలకు దిగారన్నారు. చంద్రకాంత్ గూడెంవార్ మళ్లీ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. బంద్‌కు మిశ్రమ స్పందన.. కాంగ్రెసేతర పక్షాలు పిలుపునిచ్చిన బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. ప్రధాన వ్యాపార కూడళ్లలో పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు బంద్ పాటించాలని దుకాణాదారులను కోరారు. కొన్నిచోట్ల బలవంతంగా దుకాణాలు మూయించారు. దీంతో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, బీఎస్పీకి చెందిన ఆనంద్ చందన్ శిండే, సీపీఎం తరఫున నర్సయ్య ఆడం, ఎమ్మెన్నెస్‌కు చెందిన యువరాజ్ చుంభకర్, శివసేనకు చెందిన ప్రతాప్ చవాన్ తదితరులు ప్రసంగించారు. ఆందోళన చేసే హక్కు లేదా? ఎస్ఎంసీ ఫ్లోర్ లీడర్ మహేష్ కోటే మాట్లాడుతూ.. పట్టణ వాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం తప్పా? అని నిలదీశారు. తన వార్డులో తనను సంప్రదించకుండానే పైప్‌లైన్ వేశారని, అది ఆరు నెలల వరకు ఉపయోగంలోకి రాదన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు ఆందోళన చేసే హక్కులేదా? అని నిలదీశారు. తగిన సమాధానం చెప్పి ఆందోళన విరమింపజేయాల్సింది పోయి ఇలా తప్పుకోవడం సరైన పద్దతి కాదన్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని శిరసా వహిస్తానని కమిషనర్ చంద్రకాంత్ పేర్కొన్నారు.