కమిషనర్ రాజీనామాతో భగ్గుమన్న షోలాపూర్
- కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించిన రాజకీయ పక్షాలు
- మళ్లీ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి
షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణ మున్సిపల్ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ రాజీనామా చేయడంతో ఆయా రాజకీయ పక్షాలు బుధవారం షోలాపూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. పట్టణంలో నీటి సరఫరా సక్రమంగా జరగడంలేదని ఆరోపిస్తూ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్‌కు వ్యతిరేకంగా అధికారపక్ష కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్ పాటించారు. బీజేపీ, శివసేన, బీఎస్పీ, సీపీఎం, ఎమ్మెన్నెస్ తదితర రాజకీయ పార్టీలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. అంతేకాక కమిషనర్‌కు మద్దతు తెలుపుతూ పలు సామాజిక సంఘాలు హుతాత్మ చౌక్‌లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలోని ఐదు చోట్ల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మోర్చా నిర్వహించారు. దత్తునగర్, బలిదాన్‌చౌక్, పంజారాపూల్‌చౌక్, హుతాత్మచౌక్, కర్నాచౌక్‌ల నుంచి వేర్వేరుగా ప్రారంభమైన ర్యాలీలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి. తర్వాత అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసి, కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఈ సభలో నర్సయ్య ఆడం మాట్లాడుతూ.. పట్టణంలో తలెత్తుతున్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ శాయశక్తులా కృషిచేస్తున్నారన్నారు.
నాందినిలో ఐరన్ ట్యాంకర్ నిర్మించడం, ఎన్టీపీసీ లైన్‌కు తోడుగా మరో పైప్‌లైన్ వేయించడం వంటి పనులను ఆయన చేపట్టారని గుర్తుచేశారు. పట్టణంలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేయడంతో కొందరు కుట్రపూరితంగా కమిషనర్‌ను బయటకు పంపే కుట్రలు పన్నారని, అందులోభాగంగానే ఆయన పనితీరుపై ఆందోళనలు నిర్వహించారన్నారు.
కాంగ్రెస్ ఆగడాలకు ఇంతకుముందు పనిచేసిన బిపిన్ మాలిక్, రాజేంద్ర మదనే, రామనాథ్ ఝా వంటి మంచి అధికారులుబేజారై వెళ్లిపోయారరు. పట్టణంలోని రూ.212 కోట్ల డ్రైనేజ్ కాంట్రాక్ట్‌ను కమిషనర్ చంద్రకాంత్ రద్దు చేశారని, ఆ కోపాన్ని మనస్సులో ఉంచుకొని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇలా ఆందోళనలకు దిగారన్నారు. చంద్రకాంత్ గూడెంవార్ మళ్లీ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు.
బంద్‌కు మిశ్రమ స్పందన..
కాంగ్రెసేతర పక్షాలు పిలుపునిచ్చిన బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. ప్రధాన వ్యాపార కూడళ్లలో పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు బంద్ పాటించాలని దుకాణాదారులను కోరారు. కొన్నిచోట్ల బలవంతంగా దుకాణాలు మూయించారు. దీంతో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, బీఎస్పీకి చెందిన ఆనంద్ చందన్ శిండే, సీపీఎం తరఫున నర్సయ్య ఆడం, ఎమ్మెన్నెస్‌కు చెందిన యువరాజ్ చుంభకర్, శివసేనకు చెందిన ప్రతాప్ చవాన్ తదితరులు ప్రసంగించారు.
ఆందోళన చేసే హక్కు లేదా?
ఎస్‌ఎంసీ ఫ్లోర్ లీడర్ మహేష్ కోటే మాట్లాడుతూ.. పట్టణ వాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం తప్పా? అని నిలదీశారు. తన వార్డులో తనను సంప్రదించకుండానే పైప్‌లైన్ వేశారని, అది ఆరు నెలల వరకు ఉపయోగంలోకి రాదన్నారు.
నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు ఆందోళన చేసే హక్కులేదా? అని నిలదీశారు. తగిన సమాధానం చెప్పి ఆందోళన విరమింపజేయాల్సింది పోయి ఇలా తప్పుకోవడం సరైన పద్దతి కాదన్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని శిరసా వహిస్తానని కమిషనర్ చంద్రకాంత్ పేర్కొన్నారు.