మళ్లీ పునర్విభజన..
►ఇప్పటికే 14 అసెంబ్లీ స్థానాలు, కొత్తగా మరో తొమ్మిది?
►2011 జనాభా ఆధారంగా డీలిమిటేషన్
►భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య
►రాష్ట్రంలోనే అధిక స్థానాలతో నంబర్ వన్‌గా మారే అవకాశం
►ముక్కలుకానున్న పట్టణ సెగ్మెంట్లు రిజర్వేషన్లలోనూ మార్పులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో రంగారెడ్డి జిల్లా బలీయశక్తిగా అవతరించనుంది. 2019 నాటికి తెలంగాణ శాసనసభలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లాగా రూపుదాల్చనుంది. నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను కాస్తా 153కు పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర పున ర్విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొత్తగా తొమ్మిది నియోజకవర్గాలు!
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగనుంది. దీంతో రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిఉన్న మన జిల్లాలో ఏకంగా తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు కొత్తగా ఏర్పడనున్నాయి. సగటున 2.30 లక్షల జనాభాను ప్రామాణికంగా చేసుకొని డీలిమిటేషన్‌ను చేసే అవకాశమున్న నేపథ్యంలో ఈ మేర నియోజకవర్గాల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శరవేగంగా జరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా అరకోటిని దాటింది. దీంతో శాసనసభలో జిల్లా ప్రాతినిధ్యం పెరిగేందుకు అనువుగా నియోజకవర్గాల విభజనలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా శివారు అసెంబ్లీ స్థానాలు మూడు ముక్కలుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నియోజకవర్గ భౌగోళిక స్వరూపం, చారిత్రక నేపథ్యం, కనెక్టివిటీ, పరిపాలనాపరమైన ఇబ్బందులను ఎన్నికల కమిషన్ నియమించే డీలిమిటేషన్ కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. మండలాలు, గ్రామ సరిహద్దులు చెరిగిపోకుండా ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించిన అనంతరం నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. కేవలం నియోజకవర్గాల డీలిమిటేషనేకాకుండా రిజర్వుడ్ స్థానాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన వీటిని కూడా సవరిస్తారు. అయితే ఈ తతంగమంతా పూర్తికావడానికి కనీసం మూడేళ్లు పట్టే అవకాశంలేకపోలేదు. పెరిగే అసెంబ్లీ సెగ్మెంట్లు కలుస్తాయి తప్ప.. లోక్‌సభ సెగ్మెంట్లలో ఎలాంటి మార్పులుండవు.
ప్రాంతాల మధ్య వ్యత్యాసం
2009లో పునర్విభజన జరిగినప్పుడు 2001 జనాభాను పరిగణనలోకి తీసుకోవడంతో నియోజకవర్గాల జనాభాలో వ్యత్యాసం భారీగా నమోదైంది. దీంతో గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల మధ్య సమతుల్యత కొరవడింది. తాజాగా 2011 జనగణన ఆధారంగా చేపడుతుం డడంతో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాల్సిన బా ధ్యత యంత్రాంగంపై ఉందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెరగనున్న రిజర్వ్డ్ స్థానాలు..
ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఇందులో రెండు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. తాజాగా నియోజకవర్గ పునర్విభజన చేపడితే రిజర్వ్డ్ స్థానాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతమున్న రెండు రిజర్వ్డ్ స్థానాలకు అదనంగా మరో రెండు రిజర్వ్డ్ స్థానాలు ఏర్పడనున్నాయి. మొత్తం నాలుగు రిజర్వ్డ్ స్థానాల్లో మూడు ఎస్సీ స్థానాలు కాగా, ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.
పునర్విభజనకు ప్రామాణికాలు...
►ఒక్కో నియోజకవర్గానికి సగటు జనాభా 2.30 లక్షలు
►2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 53.57 లక్షలు
►దీంతో జిల్లాలో 23 అసెంబ్లీ స్థానాలు ఏర్పడనున్నాయి
►పట్టణ నియోజకవర్గాలన్నీ ముక్కలు కానుండగా, గ్రామీణ స్థానాల్లో భారీ మార్పులు చోటుచేసుకోన్నాయి.