మాస్టర్‌ప్లాన్ ఓ మాయాజాలం
ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా భావిస్తున్న ఒక్క అమరావతి నగరంలోనే వచ్చే 20 ఏళ్లలో 45 లక్షలు, రాజధాని ప్రాంతమైన కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో కోటీ పది లక్షల జనాభా, 2050 నాటికి కోటీ 35 లక్షలకు పెరుగుతుందా? ఔననే చెప్పారు సింగపూర్ నిపుణులు. 2015 మార్చిలో సింగపూర్ నిపుణులు సమర్పిం చిన మాస్టర్ ప్లాన్‌లో సీఆర్డీఏ ప్రాంత జనాభా పైన చెప్పుకున్న విధంగా పెరుగుతుందని పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే వారు చెప్పినది ఊహాజనితమేననీ, ప్రచారార్భాటాలతో ప్రజ లను మభ్యపెట్టడానికి పన్నిన వ్యూహంలో భాగమేననీ స్పష్టమౌతుంది.
జన విస్ఫోటనం గురించి అంతా కలవరపడుతూనే ఉంటారు. కానీ సరైన సమయంలో ఎవరూ ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషిని ఆరంభిం చరు. జనాభా పెరుగుదల ప్రపంచంలో ఎక్కువ దేశాలకు శాపమే. పరిశో ధన జరిగే కొలదీ కొత్త కోణాలు బయట పడుతూనే ఉన్నాయి. జనాభా పెరుగుదల పర్యావరణకు కూడా సమస్యగా పరిణమిస్తోంది. ఆరోగ్యం మీద స్పృహ, మహిళా సాధికారత అమలు వంటి అంశాలపై అవగాహన పెరిగితే జనాభాను అదుపులో ఉంచవచ్చునంటారు నిపుణులు. కానీ ఇలాంటి కీలక అంశాల అంచనాలో, లేదా పథకాల అమలులో, ఆఖరికి సమస్య పరిష్కా రంలో కూడా నేతలు మొక్కుబడిగానే ప్రవర్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు రాజ ధానిగా భావిస్తున్న ఒక్క అమరావతి నగరంలోనే వచ్చే 20 ఏళ్లలో 45 లక్షలు, రాజధాని ప్రాంతమైన కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో కోటీ పది లక్షల జనాభా, 2050 నాటికి కోటీ 35 లక్షలకు పెరుగుతుందా? ఔననే చెప్పారు సింగపూర్ నిపుణులు. 2015 మార్చిలో సింగపూర్ నిపుణులు సమర్పించిన మాస్టర్ ప్లాన్‌లో సీఆర్డీఏ ప్రాంత జనాభా పైన చెప్పుకున్న విధంగా పెరుగుతుందని పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే వారు చెప్పినది ఊహాజనితమేననీ, ప్రచారార్భాటాలతో ప్రజలను మభ్యపెట్టడానికి పన్నిన వ్యూహంలో భాగమేననీ స్పష్టమౌతుంది. మైండ్ గేమ్‌లో ఇది కూడా ఒక దశ. వీటిని ప్రశ్నించడం అవసరం.
రాజధాని కాబట్టి అమరావతి/సీఆర్డీఏ కూడా హైదరాబాద్ వలెనే అభివృద్ధి చెందుతాయా అంటే, జనాభాపరంగా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవనే సమాధానం వస్తుంది. లక్షలలో వలసలు జరుగు తాయా అన్నది కూడా అనుమానమే. రాష్ర్టం విడిపోయిందనీ, ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవి 13 జిల్లాలేననీ గమనించాలి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మహా నగరాలు రాయలసీమను ఆనుకొనే ఉన్నాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు.
1992లో ఐటీ శకం మొదలయ్యేనాటికే హైదరాబాద్‌లో బలమైన పారిశ్రామిక, శాస్త్ర-సాంకేతిక, విద్యా, పరిశోధనా వ్యవస్థలు నెల కొన్నాయి. నాటి జనాభా 43.6 లక్షలు. పదేళ్లలో 57.2 లక్షలకు, 2011కు 77.5 లక్షల జనాభా పెరిగింది. ఈ రెండు దశాబ్దాలలో ఐటీ రంగం వేగంగా విస్తరించింది. అయినప్పటికీ 1992 తర్వాత మరో 40 లక్షలు (దాదాపు) మాత్రమే జనాభా పెరగడం సాధ్యమైంది. ఇతర రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలసలు సాగాయి.
హైదరాబాద్ ఆకర్షించిన స్థాయిలో అమరావతి కూడా పెట్టుబడులను, ఉద్యోగులను, విద్యార్థులను, అసంఘటిత రంగాలను ఆకర్షించడం సాధ్యం కాదు. ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని కావడం, ఆహ్లాదకర వాతావరణం, నగరం చుట్టూ లక్షల ఎకరాల బంజరుభూములు ప్రభుత్వ అధీ నంలో ఉండడం వంటి కారణాలు హైదరాబాద్‌కు కలిసొచ్చాయని గుర్తించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్టుబడి పెట్టాలనుకొనే ఐటీ కంపెనీలకుగానీ, సేవా రంగంలోని ఇతర కంపెనీలకు గానీ ఇప్పుడున్న పరిస్థితులలో విశాఖ పట్నమే మొదటి ఆకర్షణ అవడానికి అవకాశాలు ఎక్కువ.
విజయవాడ పెరుగుదలను గురించి కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబోయే గణాంకాలు, జనాభా లెక్కలు గతంలో కూడా ఇచ్చిన ప్పటికీ మరొకసారి ప్రస్తావించడం అవసరం. పట్టిక 1ని గమనిస్తే 2011 నాటికి విజయవాడ నగర కార్పొరేషన్ జనాభా 10.34 లక్షలు ఉంది. ఆ నగరం చుట్టూ ఉన్న 23 చిన్న చిన్న పట్టణాలు (మంగళగిరి, తాడేపల్లి సహా), పంచాయతీలు, గ్రామాలు కలుపుకొని అర్బన్ జనాభా 14.91 లక్షలు.
1991 తర్వాత రెండు దశాబ్దాలలో నగరం పెరుగుదల 20 శాతానికి దగ్గరగా మాత్రమే ఉంది. దీని ప్రకారం ఒక నగరానికి ఈ పెరుగుదల తక్కువ కిందే లెక్క. ఇప్పుడు విభజన అనంతరం విజయవాడ ప్రాంతం రాజధాని అయింది కాబట్టి భవిష్యత్తులో ఈ నగరం గణనీయంగా పెరుగు తుందన్న వాదనకు ఆధారం లేదు. కృష్ణా-గుంటూరు జిల్లాలలో జనాభా పెరుగుదల తీరును పరిశీలిస్తే ఈ అంశం అవగతమవుతుంది. (పట్టిక 2).
రెండు-మూడు దశాబ్దాలలో భారత జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గిన రాష్ట్రాలలో కేరళ, తమిళనాడుల తరువాతి స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ అభివృద్ధి చెందిన జిల్లాలలో ఆ తగ్గుదల సుస్పష్టం. పట్టిక 2ను గమనిస్తే 1981-91 దశకం తర్వాత రెండు జిల్లాలలోను మొత్తం, గ్రామీణ జనాభా పెరుగుదలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. కృష్ణాలో అయితే గ్రామీణ ప్రాంతంలో నికరంగా తగ్గుదలే కనిపిస్తున్నది. ఇది మామూలు విషయం కాదు. నగరీకరణ పెరుగుదల కూడా 20-22% లోనే ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2010-11లో నగరీకరణ ఇదేవిధంగా (20.78%) ఉన్నప్పటికీ హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) శివారు ప్రాంతాలు 70 శాతం పెరిగాయి.
కృష్ణా జిల్లాకు ఆనుకొని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో నగరీకరణ పెరుగుదల అత్యంత తక్కువగా (6.01%). తూర్పుగోదావరి జిల్లాలోను అది 10.56% మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలపు నగరీకరణలో రాయ లసీమలో ఎక్కువగాను (43.60%), తరువాత తెలంగాణ (39.29%), కోస్తాంధ్ర (18.45%) స్థానాలు పొందాయి. జాతీయ స్థాయిలో 2001-11 నగరీకరణ పెరుగుదల 31.80 శాతంగా నమోదైంది.
కొంతకాలాన్ని తీసుకుని జనాభా పెరుగుదలను విశ్లేషించేటపుడు సాంవత్సరిక పెరుగుదలను ముఖ్యంగా చూస్తారు. ఆవిధంగా చూసిన ప్పటికి గుంటూరు-కృష్ణాలలో గత రెండు దశాబ్దాలలో నగరీకరణ పెరుగు దల 3.5 శాతం లోపే ఉన్నది. సీఆర్డీఏ ప్రాంతంలో వచ్చే 20 ఏళ్లలో సరాసరి 6.62 శాతం, విజయవాడ-అమరావతి ప్రాంతంలో 9.21 శాతం జనాభా పెరుగుతుందని అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతం ప్రధానంగా ఉన్నచోట కూడ 4.5 శాతం పైగా అంచనా వేశారు. మొన్న సీఆర్డీఏ విడుదల చేసిన ఫ్యాక్ట్ బుక్ ప్రకారం రాజధాని ప్రాంత జనాభా 58.74 లక్షలు (2011). 2001 జనాభా 52.45 లక్షలు. అంటే గత దశాబ్దంలో సాంవత్సరిక వృద్ధి 1.14 శాతం మాత్రమే. ఇది 6.62కు త్వరత్వరగాపెరగడమనేది పూర్తిగా వాస్తవ విరుద్ధం.
జనాభాకు సంబంధించిన అంశాలను కూడా సరిగా అంచనా వేయకుండానే మలేషియా, సింగపూర్ నిపుణుల పేరుతో కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ అంటూ మాయాజాలాన్ని ప్రదర్శించడం నిజాయితీ కలిగిన ప్రభుత్వాలు చేయాల్సిన పనికాదు.
ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య
రచయిత సెస్ పరిశోధనా సంస్థలో ఆచార్యులు, నగరీకరణ విశ్లేషకులు
ఈమెయిల్ : crchandraiah@gmail.com