ఆకట్టుకున్న జగన్ ఉర్దూ ప్రసంగం
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎంఎస్ మక్తా ప్రాంతంలో జగన్ ఉర్దూ ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. తొలుత యథావిధిగా జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఎక్కువ మంది ఉర్దూనే మాట్లాడతారని, మీరు కూడా ఉర్దూలో మాట్లాడితే బాగుంటుందన్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పి.విజయా రెడ్డి కోర్కె మేరకు జగన్ తన ప్రసంగాన్ని ఉర్దూలో కొనసాగించారు. ఏవో రెండు మాటలు ఉర్దూలో మాట్లాడి.. మళ్లీ తెలుగులో జగన్ ప్రసంగాన్ని కొనసాగిస్తారని అనుకుంటే... జగన్ తన ప్రసంగాన్ని ఆద్యంతం ఉర్దూలోనే కొనసాగించి సభికులను ఆశ్చర్యచకితులను చేశారు. జగన్ ‘హైదరాబాదీ ఉర్దూ’ సభికులను విశేషంగా ఆకర్షించింది.