దాడికి అమెరికా సెనేట్ తీర్మానం!
వాషింగ్టన్/కైరో: సిరియాపై సైనిక దాడికి అనుకూలంగా అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని రూపొందించింది. సిరియాపై అరవై రోజుల వరకు దాడికి అనుమతిస్తూ సెనేట్ విదేశాంగ కమిటీ ఈ తీర్మానాన్ని రూపొందించింది. సిరియా భూభాగంపై అమెరికన్ బలగాలు అడుగు పెట్టకుండానే, అరవై రోజుల్లోగా దాడిని ముగించాలని తీర్మానంలో స్పష్టం చేసినట్లు అమెరికన్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సిరియాపై దాడి తలపెట్టిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఈ అంశంపై అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు కొందరు సభ్యుల నుంచి అభ్యంతరాలు ఎదురైనా, తీర్మానానికి అనుకూలంగా వారిని ఒప్పించినట్లు సెనేట్ విదేశాంగ కమిటీ చైర్మన్ రాబర్ట్ మెనెండెజ్ చెప్పారు.
అయితే, తీర్మానం పూర్తి ప్రతిని సెనేట్ మీడియాకు విడుదల చేయలేదు. కాగా, సిరియా వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం విశ్వసనీయత డోలాయమానంలో ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. సిరియా దాష్టీకంపై అంతర్జాతీయ సమాజం మౌనం వహించరాదని ఆయన అన్నారు. అయితే, తమపై ఎలాంటి దాడి జరిగినా తిప్పికొడతామని సిరియా విదేశాంగ ఉపమంత్రి ఫైసల్ ముఖ్దాద్ మరోసారి హెచ్చరించారు. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం తలెత్తినా, వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, అమెరికా, దాని మిత్రదేశాలు సిరియాపై ఐక్యరాజ్య సమితి ఆమోదం లేకుండా ఏకపక్ష దాడికి దిగరాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. రసాయనిక ఆయుధాల వినియోగం జరిగినట్లు ఆధారాలు చూపాలని ఆయన అన్నారు. సిరియా సర్కారు రసాయనిక ఆయుధాలను వినియోగించినట్లు సందేహాలకు తావులేని రీతిలో రుజువైనట్లయితే, సిరియాపై సైనిక దాడికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి తాము మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.
అయితే, దాడి జరిగిన ప్రదేశంలో సిరియా సైనిక బలగాలు మోహరించి ఉన్న సమయంలో అక్కడ రసాయనిక ఆయుధాలు ప్రయోగించినట్లు ఆరోపించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. ఒబామా సహా పలువురు దేశాధినేతలు పాల్గొననున్న జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే ముందు పుతిన్ రష్యన్ ప్రభుత్వ టీవీ చానల్ ‘చానల్-1’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు, సిరియా సమస్యకు సైనిక పరిష్కారాలేవీ లేవని భారత్ అభిప్రాయపడింది. పరిస్థితిలో స్పష్టత ఏర్పడిన తర్వాత ఈ అంశంలో తమ వైఖరిని స్పష్టం చేస్తామని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.