బ్యాంకులు మూత
తాడేపల్లిగూడెం/ఏలూరు, న్యూస్‌లైన్ :వేతన సవరణ, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపుమేరకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో సోమవారం ఒక్కరోజే జిల్లాలో రూ.2వేల కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. సాధారణంగా వాణిజ్య వినియోగదారులు, అత్యధిక మొత్తాలతో ఆర్థిక వ్యవహారాలు నడిపేవారు 10వ తేదీన బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. మరోవైపు వారంలో తొలిరోజు కావటం వల్ల వల్ల కూడా బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా సుమారు 5వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగటంతో 800 శాఖలు మూతపడ్డాయి.
ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), ఆలిండియా బ్యాంకు ఎంప్లాయూస్ అసోసియేషన్ (ఏఐబీఈఎ) ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండు రోజులపాటు సమ్మెలో ాల్గొంటున్నారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం పనిచేశాయి. జీతాలు, బిల్లులు, చెక్కుల క్లియరింగ్ వ్యవహారాలు సమ్మె కారణంగా స్తంభించాయి. జిల్లాలో ఒక్క చెక్కుల రూపంలోనే రూ.1,500 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయూయని జాతీయ బ్యాంకుల యూనియన్ నాయకుడు ఎస్ఎస్ ప్రసాద్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఏలూరు నగరంలో 60, భీమవరం పట్టణంలో 42, తణుకులో 24, తాడేపల్లిగూడెం ప్రాంతంలో 50కు పైగా బ్యాంకు బ్రాంచిలు మూతపడ్డాయని వివరించారు. నగదు లావాదేవీలకు అవకాశం లేక. ఏటీఎంలలో ఉంచిన సొమ్ములు త్వరగా అయిపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.