నిఘా నేత్రం
పెరుగుతున్న సీసీ కెమెరాల వినియోగం
ఈ నిఘా వ్యవస్థతో చోరీల నియంత్రణ
కంప్యూటర్లు, సెల్ఫోన్లలో లైవ్ వీడియో
ప్రస్తుతం నగరంలో భద్రత ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రముఖ వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్క్కే పరిమితమైన సీసీ కెమెరాల వినియోగం నేడు చిన్నచిన్న నగదు దుకాణాలు, సూపర్ మార్కెట్లు, వస్త్ర దుకాణాలు, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకులు, పెద్ద ఎత్తున సిబ్బంది పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా విస్తరించింది. నగరంలోని రైల్వే స్టేషన్లో ఒకటో నెంబరు ప్లాట్‌ఫారమ్‌పై 8 సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది.
తర్వాత మిగిలిన ప్లాట్‌ఫారమ్స్ కూడా దీనిని విస్తరించనున్నారు. ప్రముఖుల ఇళ్లలో సైతం వీటిని అమర్చుకుంటున్నారు. నేర నియంత్రణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వీటి వినియోగం క్రమేణా పెరుగుతోంది. వీటి ధర అందుబాటులో ఉండడంతో ఈ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అవసరాలను బట్టి మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
- ద్వారకానగర్
నేర పరిశోధనలో కీలకం
ఇంటికి, దుకాణానికి వేసిన తాళం వేసినట్టే ఉంటాయి. ఇంట్లో వస్తువులు చోరీకి గురవుతుంటాయి. ఇలాంటి కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడంలో తీవ్ర జాప్యం అవుతుంది. అదే సీసీ కెమెరాలు ఉంటే పని మరింత సులువుతుంది. ఇటీవల పలు కేసుల్లో సీసీ కెమెరాల ఫుటేజీలు కీలకంగా మారాయంటే వీటి పనితీరు ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. చిమ్మచీకట్లో సైతం మనిషి కదలికను గుర్తించే కెమెరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. సెల్ఫోన్లో లైవ్ చూపించే కెమెరాలను ఇంటికి, దుకాణంలో అమర్చుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు.
పలు రకాలు సీసీ కెమెరాలు
ఇది ఐఆర్ బుల్లెట్ విత్ మెటల్ కెమెరా
ప్రత్యేకత: కెమెరా మొత్తం మెటల్ బాడీతో ఉంటుంది. ఉదయం, రాత్రి సమయాల్లో రికార్డు చేస్తుంది.
నిఘా పరిధి : 10 మీటర్లు
ధర : రూ.2,275 నుంచి..ఆపై
ఐఆర్ బుల్లెట్ విత్ ఎల్ఈడీ
ప్రత్యేకత : కెమెరా మొత్తం మెటల్ బాడీతో రూపొందించడమే కాకుండా 48 ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. వీటి సాయంతో రాత్రి సమయాల్లో కూడా వీడియో క్లారిటీగా వస్తుంది.
నిఘా పరిధి : 30 మీటర్లు
ధర : రూ.3 వేల నుంచి ఆపై...
ఐఆర్ బుల్లెట్ కెమెరా
ప్రత్యేకత ః వైర్లెస్ పవర్‌పుల్ బుల్లెట్ కెమెరా ఉదయం, రాత్రి సమయాల తోపాటు జీరో లైట్లో కూడా రికార్డు చేస్తుంది.
నిఘా పరిధి: 20 నుంచి 25 మీటర్లు
ధర : రూ.2,500 నుంచి ప్రారంభం
సీసీ కెమెరాలు అమర్చేది ఇలా...
స్టెప్ 1: ఇంట్లో డిజిటల్ వీడియో రికార్డర్
(డీవీఆర్)ను అమర్చుకోవాలి...
ఇంట్లో కెమెరాలను బిగించి పవర్ సప్లయి బాక్స్‌ను అనుసంధానించాలి. ఈ బాక్స్ కెమెరాలు కరెంటును డీసీ నుంచి ఏసీకి మార్చుతుంది. ఈ కెమెరాలను డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)కు కనెక్ట్ చేయాలి. ఒక్క డీవీఆర్ 4 నుంచి 32 సీసీ కెమెరాల వరకు కనెక్ట్ చేయవచ్చు. దీని ధర రూ.6,550. తర్వాత దీనిని ‘రూటర్’అనే పరికరానికి అమర్చాలి. ఇది ఇంట్లో అమర్చిన కెమెరాల కనెక్షన్లను డీవీఆర్కు అందిస్తుంది. ఇంట్లో 360 డిగ్రీల కోణంలో కెమెరాలు తిరుగుతూ చిత్రించాలి. కావాలంటే రొటేటర్ అనే పరికరాన్ని కూడా కెమెరాలకు అమర్చుకోవచ్చు.
డోర్లో వీడియో ఫోన్
ప్రత్యేకత: సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా వీడియో డోర్ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో ఇంటి తలుపు ముందుకు ఎవరు వచ్చారో తెలుసుకోవచ్చు. వారితో మాట్లాడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో లేని సమయాల్లో ఎవరు డోర్ కొట్టినా వారి చిత్రాలను నిక్షిప్తం చేస్తుంది.
ప్రారంభం ధర: రూ. 6,255 నుంచి ఆపై....
ఐఆర్ డోమ్ కెమెరా
ప్రత్యేకత: ఉదయం, రాత్రి సమయాల్లో రికార్డ్ చేస్తుంది. ఉదయం సమయంలో కలర్, రాత్రి సమయాల్లో బ్లాక్ అండ్ వైట్ల లో చిత్రీకరిస్తుంది. చీకట్లో కూడా చిత్రాలను రికార్డు చేయడంలో మరో విశేషం.
నిఘా పరిధి: 5 నుంచి 10 మీటర్లు
ధర : రూ.1500ల నుంచి ప్రారంభం
స్టెప్ 2 : సెల్‌ఫోన్‌కు ఇలా కనెక్ట్ చేసుకోవాలి...
మొదట సంబంధిత నెట్వర్క్ మనకు ఒక ఇంటర్నెట్ ప్రొటోకాల్ (స్టాటిక్ ఐపీ) నంబర్ ఇస్తుంది. ఈ నంబర్‌ను అంతకుముందే ఇంట్లో అమర్చిన డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆ ర్)తో కాన్ఫిగరేషన్ చేయాలి. అప్పుడు మనకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. ఇప్పుడు మన సెల్ఫోన్లో ఇంట్లోని సీసీ కెమెరాల పనితీరును చూడాలనుకుంటే, సెల్ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసి మన దగ్గరున్న ఐపీ నంబర్‌ను టైప్ చేస్తే సెల్‌ఫోన్ స్క్రీన్ మీద యూజర్ ఐడీ, సాప్వర్డ్ అని అడుగుతుంది. అది టైప్ చేస్తే సీసీ కెమెరాల నుంచి లైవ్ దృశ్యాలు ఫోన్లో కనిపిస్తాయి. డీవీఆర్‌లో ఉండే హార్డ్ డిస్క్ సుమారు 30 గిగా బైట్స్ జీబీల మెమరీని రికార్డ్ చేస్తుంది. టీవీకీ ఉండే ఏవీ హోల్‌కు నేరుగా కనెక్ట్ చేస్తే చాలు. ఇవి ఎక్కువగా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లో వినియోగిస్తున్నారు.
రూటర్
ఇంట్లో అమర్చిన కెమెరాల కనెక్షన్లను డీవీఆర్కు అనుసంధానానికి ‘రూటర్’ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది డీవీఆర్ నుంచి సెల్‌ఫోన్‌కు ఇంటర్నెట్ షేరింగ్ చేస్తుంది. ధర దాదాపు రూ.7 వేలు.
రొటేటర్
దీన్ని స్కానర్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఇండోర్, అవుట్డోర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. కెమెరాను 360 డిగ్రీల కోణంలో తిప్పుతూ చుట్టూ రికార్డ్ చేయడం దీని ప్రత్యేకత. ధర రూ.645 నుంచి రూ.5,250 వరకు ఉంది.
సీసీ కెమెరాలు తప్పనిసరి
ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం వందమంది ఉంటే ప్రతి చోట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రజా భద్రత చట్టం చెబుతోంది. దీంతో అపార్టుమెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
- సత్యనారాయణ, సైబర్ క్రైమ్ సీఐ, విశాఖపట్నం.