సిగరెట్ ప్యాకెట్లపై 85% స్థలంలో హెచ్చరికలు
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. పొగతాగటం వల్ల అనర్థాలపై సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం స్థలంలో చట్టబద్ధమైన హెచ్చరికలను తప్పనిరిగా ముద్రించాలని తయారీ కంపెనీలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పొగాకు ఉత్పత్తుల తయారీ కంపెనీలు సిగరెట్ పెట్టెపై 60 శాతం స్థలంలో ధూమపానం వల్ల కలిగే నష్టాలపై రేఖా చిత్రాలు, 25 శాతం స్థలంలో హెచ్చరికలను తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. సిగరెట్ల తయారీ కంపెనీలు ప్యాకెట్లపై దీనికి అనుగుణంగా మార్పులు చేసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు గడువు ఇవ్వనున్నారు.