మధ్యవర్తిత్వం లేకుండా రైతుకు ప్రయోజనం
అమలాపురం టౌన్ :
మార్కెట్పరంగా కొబ్బరి రైతులకు మధ్యవర్తిత్వం లేకుండా ధరల విషయంలో ప్రయోజనాలు చేకూర్చేందకు కోకోనట్ డవలప్మెంట్ బోర్డు కృషి చేస్తోందని ఆ బోర్డు ఫీల్డ్ ఆఫీసర్ ఎం.కిరణ్‌కుమార్ అన్నారు. ఇందుకోసం రైతులు సంఘాలుగా, సంఘాలు ఫెడరేషన్లుగా, ఫెడరేషన్లు కంపెనీలుగా ఏర్పడినప్పుడే రైతులకు ఆ ప్రయోజనాలు సాధ్యమవుతాయన్నారు. అమలాపురంలోని నోవెల్ కోకోనెట్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన వివిధ కోకోనెట్ కంపెనీల చైర్మన్లు, ఫెడరేషన్ల అధ్యక్షులతో జరిగిన సదస్సులో కిరణ్‌కుమార్ ప్రసంగించారు. నోవెల్ కోకోనట్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ డీఆర్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉభయ గోదావరి కోకోనట్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ గంధం చిన వీరరామారావు, చైతన్య కోకోనట్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ సీహెచ్.శివరామకృష్ణరాజు, రామకృష్ణ కోకోనట్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ సీహెచ్. టెండన్‌రాజు పాల్గొన్నారు. బోర్టు ఫీల్డ్ ఆఫీసర్ మాట్లాడుతూ కోకోనట్ ఫెడరేషన్లు, కంపెనీల ద్వారా ఇప్పటికే రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తున్నామన్నారు. అయితే రైతులు తమ సంఘాలు బ్యాంకుల్లో తెరిచిన అకౌంట్లతో షేరుధనం డిపాజిట్లు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో బోర్డు రైతులకు ఇచ్చే రాయితీలన్నీ ఫెడరేషన్, కంపెనీల ద్వారానే విడుదల చేస్తుందని గుర్తు చేశారు.
ఆరోపణలపై చర్చ
కోకోనట్ కంపెనీలు రైతుల నుంచి తమ తమ బ్యాంకు అకౌంట్లలో షేరు ధనంలా కొబ్బరి చెట్టుకు రూ. ఆరు వంతున చెల్లించాలని కంపెనీలు సభ్యులుగా ఉన్న రైతులను కోరుతున్న అంశంపై పలు ఆరోపణలు వస్తున్న క్రమంలో సదస్సు చర్చించింది. ముమ్మిడివరంలో నోవెల్ కోకోనట్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్‌పై ఓ సంఘం రైతు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా విలేకర్లు ప్రస్తావించగా దానిపై కంపెనీల చైర్మన్లు, బోర్డు ఫీల్డ్ ఆఫీసర్ చర్చించారు. తర్వాత కంపెనీ చైర్మన్ రాజు తన కంపెనీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నానని అందుకు సంబంధించిన రికార్డులను చూపించారు.