నీటి సరఫరాలో కోత విధించబోం: బీఎంసీ
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త! ఏడాదిపాటు నీటి సరఫరాలో కోత ఉండబోదు. ఈ విషయాన్ని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం ప్రకటించింది. గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే ఈసారి జలాశయాల్లో నీటినిల్వలు గణనీయంగా నమోదయ్యాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో 13.97 లక్షల మిలియన్ లీటర్ల వరకు ‘యూజ్ఫుల్ స్టాక్’ నమోదైందన్నారు.
అదేవిధంగా తుల్సీ, మోదక్సాగర్, తాన్సా, విహార్, మధ్య వైతర్ణ జలాశయాలు ఇప్పటికే పొంగిపొర్లుతున్నాయి. గత మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు కళకళలాడుతున్నాయి. మరో 350 రోజుల వరకు నగర వాసులకు ఎలాంటి నీటి కోత సమస్య ఉండదు. జలాశయ పరీవాహక ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టం స్థాయి భారీగా పెరిగింది. ప్రారంభంలో వర్షాలు కురవకపోవడంతో నగరవాసులు నీటి కోతలను ఎదుర్కోవాల్సివచ్చింది. దీంతో బీఎంసీ గృహ సముదాయాలకు 20 శాతం నీటి కోత విధించిన విషయం తెలిసిందే.
అయితే వర్షాలు ఆలస్యంగా కురిసినా అనుకున్నంత స్థాయిలో కురవడంతో బీఎంసీ నీటి కోతలను ఎత్తివేసింది. అంతేకాకుండా వచ్చే ఏడాది వరకు నగర వాసులకు సరిపడా నీటి నిల్వలు ఈసారి నమోదయ్యాయి. ప్రస్తుతం తుల్సి, మోదక్సాగర్, తాన్సా, విహార్, మధ్య వైతర్ణ జలాశయాలు ఇప్పటికే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు ఇదేవిధంగా కురిస్తే ఎగువ వైతర్ణ జలాశయం కూడా ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ హైడ్రాలిక్ ఇంజినీర్ ఎ.ఎస్.తవాడియా మాట్లాడుతూ పరీవాహక ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని తెలిపారు. నగరానికి సరిపడా నీటిమట్టాలు జలాశయాల్లో నమోదయ్యాయన్నారు. సాధారణంగా నీటి సరఫరాను అక్టోబర్ నుంచి జూలై వరకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు.