వైభవంగా ఉట్లమాను పరుష
ధర్మవరం అర్బన్ : పట్టణంలోని దుర్గమ్మ ఆలయం సమీపంలో శుక్రవారం నిర్వహించిన ఉట్లమాను పరుష అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిఏటా ఉగాది పండుగ అనంతరం దుర్గమ్మ ఆలయం వద్ద ఉట్లమాను పరుష నిర్వహించడం ఆనవాయితీ. మొదట దుర్గమ్మ ఆలయం ఈఓ ఆనంద్ ఆధ్వర్యంలో బోయ కులస్తులు దుర్గమ్మదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తప్పెట్లు, డప్పుల వాయిద్యాల నడుమ మహిళలు, ప్రజలు చిందులు వేస్తూ ఉట్లమాను వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఉట్లమాను చుట్టూ బురద ఏర్పాటు చేశారు.
ఉట్లమానుకు పూజలు చేసిన అనంతరం ఉట్లమాను పైకి ఓ యువకుడిని తాడు సాయంతో ఎక్కించారు. పైన కూర్చున్న వ్యక్తి బురదను ఉట్లమానుకు పోస్తున్న సమయంలో యువకులు కింద నుంచి ఎక్కేందుకు ఎగబడ్డారు. పరుషను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. కాగా ఉట్లమాను ఎక్కిన విజేత నరేష్‌కు రూ.5116 ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందించారు. వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. సీఐ హరినాథ్, ఎస్ఐ సురేష్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.