కొత్తగా 10 మంది మంత్రుల ప్రమాణం
న్యూఢిల్లీ: ఇటీవల ఉద్వాసనకు గురైన ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతికి మళ్లీ మంత్రి పదవి దక్కింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం మంత్రి వర్గాన్ని విస్తరించారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్.. 10 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ఏడుగురికి కేబినెట్ హోదా, ముగ్గురికి సహాయ మంత్రి పదవి హోదా దక్కింది. 2012 మార్చి నుంచి అఖిలేష్ మంత్రివర్గాన్ని విస్తరించడమిది ఎనిమిదోసారి.
ఈ రోజు మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ప్రజాపతి, మనోజ్ పాండే, శివకాంత్ ఓఝా, అభిషేక్ మిశ్రా, రియాజ్ అహ్మద్, జియావుద్దీన్ రిజ్వీ, రవిదాస్ మెహ్రోత్రా, నరేంద్ర వర్మ, యాసీర్ షా, షాంఖ్లాల్ మాఝి ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం అఖిలేష్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు యూపీ పార్టీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్, మంత్రులు పాల్గొన్నారు. ప్రజాపతిపై అవినీతి ఆరోపణలు రావడంతో అఖిలేష్ ఇటీవల ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అఖిలేష్‌కు, బాబాయ్, సీనియర్ మంత్రి శివపాల్ యాదవ్‌కు విబేధాలు ఏర్పడ్డాయి. ములయాం సింగ్ యాదవ్ జోక్యంతో ఈ వివాదం ముగిసింది. అలాగే ప్రజాపతిని మళ్లీ కేబినెట్లోకి తీసుకునేందుకు అఖిలేష్ అంగీకరించారు.