కుతుబ్‌మినార్ కాల్పుల ఘటనలో మరో ఇద్దరు అరెస్టు
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని కుతుబ్‌మినార్ సమీపంలో ఓ 24 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన కేసులో మరో ఇద్దరిని ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మార్చి 9న తన స్నేహితుడు సందీప్‌తో కలిసి కియోస్క్ వద్ద టీ తాగుతుండగా కొందరు దొండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సోను అక్కడికక్కడే మరణించగా, సందీప్ గాయాలపాలయ్యాడు. వివరాలు.. సోను సెజ్వాల్(24) సెంట్రల్ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో పనిచేసేవాడు. సోను స్నేహితుడు నరేందర్‌తో నీరజ్ అనే వ్యక్తికి డబ్బు విషయమై ఉన్న వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఆలోచనతో నీరజ్ తన స్నేహితులు ముగ్గురితో లడో సరాయ్ టీ పాయింట్‌కి చేరుకున్నాడు. అక్కడికి నరేందర్‌తో పాటు అశోక్, సందీప్, సోను కూడా అదే టీ స్టాల్‌కి వెళ్లారు. రెండు గ్రూపుల మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో నీరజ్ మరికొంత మంది స్నేహితులను అక్కడికి పిలిపించాడు.
వారు ఆయుధాలు కూడా తీసుకురావడంతో వాటితో తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి నీరజ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సోను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో రాజీవ్ చౌహాన్, సంజీవ్ శర్మ పాల్గొన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం నాలెడ్జి పార్కు వద్ద వారిద్దరినీ అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 10కి చేరింది. అంతకు ముందు నీరజ్, అరవింద్ కుమార్, కరణ్‌జిత్, రవీందర్ పవార్, కమల్, జగ్‌మోహల్ సాగర్, ద్రుప్, కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.