‘చంద్రబాబు ఘనకార్యం ఏంటో అర్థమైంది’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఉత్తరాంధ్ర చర్చా వేదిక’ డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని, తమ పూర్తి మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులు శనివారం సీపీఎం నేతలను కలిశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు 10 ఏళ్లు అధికారానికి దూరం అయ్యావు. మళ్లీ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావని చంద్రబాబు అడిగాను. మేమిద్దరం కలిసి ఘనకార్యం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఆ ఘనకార్యం ఏమిటో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కు ప్రత్యామ్నాయంగా ‘ప్రత్యేక ప్యాకేజీ’ అన్నారు. అదీ లేదు. రాష్ట్రానికి ‘హోదా’ ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది. దీన్ని వేరే రాష్ట్రాలతో ముడిపెట్టి చూడకూడదు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగకపోగా, మరింత వెనుకబడిపోయాయి.’అని అన్నారు.
చేతులు దులుపుకోవాలంటే కుదరదు..
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ... నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచారు. చంద్రబాబుకు ఎప్పుడూ మాట మార్చడం అలవాటే. ఇవాళ ఆగ్రహం, రేపు సంతోషం. రాష్ట్రం పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమను టీడీపీ ఇన్నాళ్లు కప్పిపెడుతూ, సంరక్షిస్తూ వచ్చింది. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా మోసం చేసిన తర్వాత, తనదాకా వచ్చిన తర్వాత, ఎన్నికల ముందు చంద్రబాబు కోపాన్ని నటిస్తున్నారు. మొత్తం తప్పునంతటినీ కేంద్ర ప్రభుత్వంపై నెట్టి, చంద్రబాబు చేతులు దులుపుకోవాలంటే కుదరదు. ప్రత్యేక ప్యాకేజీ అని ఇన్నాళ్లు ఊరించారు. అది ఇప్పుడు ఉత్తదే అని తేలింది. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాల్సిందే. కేంద్రంతో పోరాడితేనే రాష్ట్రానికి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాన్ని గత అనుభవాలే చెప్పాయి. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువ.’ అని ఎద్దేవా చేశారు.
ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుతో సహా, తమ డిమాండ్లన్నింటినీ అమలు చేసేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.