'స్వరూపానందేంద్రకి టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి'
శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామికి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలను ఉత్తరాంధ్ర సాధూ పరిషత్ బుధవారం విశాఖపట్నంలో డిమాండ్ చేసింది. పీఠాధిపతులు, స్వామీజీలను కించపరచడం తగదని టీడీపీ నేతలకు హితవు పలికింది. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సీఎంగా రాత్రి పూట ప్రమాణ స్వీకారం చేయకూడదని చంద్రబాబుకు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి సూచించిన సంగతిని ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సాధూ పరిషత్ గుర్తు చేసింది. స్వామీజీలను కించపరిస్తే చట్టపరమైన చర్యలకు సిద్దమని పరిషత్ హెచ్చరించింది.
సోమవారం గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ... ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని, గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. అలాగే చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఎంతోమంది చనిపోతున్నారని చెప్పారు. గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు దుష్ఫలితాలు పొందారని ఈ సందర్బంగా స్వామీజీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్వామీజీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. దాంతో ఉత్తరాంధ్ర సాధూ పరిషత్‌పై విధంగా స్పందించింది.