ఫేస్బుక్ ప్రేమ.. ఆమెను నాశనం చేసింది
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో పరిచయమైన ఉజ్బెక్ మహిళను ప్రేమ పేరుతో రప్పించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఢిల్లీలో వసంత్‌కుంజ్ ప్రాంతానికి చెందిన అల్తాఫ్ అలియాస్ రాజు (34)కు ఉజ్బెక్‌కు చెందిన ఓ యువతి (23) గతేడాది మేలో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. అల్తాఫ్ తరచూ ఆమెతో చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. భారత్‌కు వస్తే ఇద్దరూ కలసి వ్యాపారం చేసుకోవచ్చని ఆశ చూపాడు. దీంతో అతని మాటలు నమ్మి ఆమె ఢిల్లీకి వచ్చింది. ఉజ్బెక్ యువతిని ఓ హోటల్లో ఉంచిన అల్తాఫ్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి.. దేశం విడిచి పారిపోతే వీటిని ఆన్లైన్లో పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత ఉజ్బెక్ యువతిని తన భార్య అంజలికి పరిచయం చేశాడు. అల్తాఫ్, అతని భార్య ఆమె పాస్ పోర్టు, డబ్బు లాక్కుని బంధించారు. ఉజ్బెక్ యువతిని బలవంతంగా వ్యభిచారవృత్తిలోకి దింపి, ఆమె దగ్గరకు విటులను పంపేవారు. గత శనివారం వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు వసంత్‌కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంజలిని అరెస్ట్ చేయగా, అల్తాఫ్ పరారీలో ఉన్నాడు. అతనిపై గతంలో క్రిమినల్ కేసులు నమోదైనట్టు పోలీసులు చెప్పారు. అల్తాఫ్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.