మార్కెట్లోకి వోల్వో ‘వి40’ లగ్జరీ కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో హాచ్బ్యాక్ విభాగంలో ‘వి40’ మోడల్ కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యాధునికమైన టెక్నాలజీ, సౌకర్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ ‘వి40’ని రూపొందించినట్లు వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ టామ్ వన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘వి40’ కారుని లాంఛనంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా పాదచార్లను ఢీకొట్టినా, వారికి తీవ్ర గాయాలు కాకుండా ఉండే విధంగా కారు బయట కూడా ఎయిర్‌బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కారులో మొత్తం ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయడంతో డ్రైవర్‌తో సహా కారులో ప్రయాణించే వారందరికీ పూర్తి భద్రత ఉంటుందన్నారు. కెనటిక్, ఆర్-డిజైన్ అనే రెండు వేరియంట్స్‌లో 40 లభిస్తుందని, కెనటిక్ ధరను రూ. 24.75 లక్షలు (ఎక్స్ షోరూం ధర), ఆర్-డిజైన్ ధర రూ. 27.7 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు.
దేశీయ లగ్జరీ కార్ల అమ్మకాల్లో వృద్ధి తగ్గుతోందని, ఈ ఏడాది 10 - 12 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు టామ్ తెలిపారు. పరిశ్రమ రేటు కంటే అధిక వృద్ధిరేటును వోల్వో నమోదు చేస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న ఎస్యూవీ ‘ఎస్ఎక్స్ 90’ను ఈ ఏడాది చివర్లోగా విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఎస్ఎక్స్ -90 ధర రూ. 65-70 లక్షలు ఉండే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
గతేడాది తెలంగాణలో 300 యూనిట్లు, విశాఖపట్నంలో 100 యూనిట్లు విక్రయించామని, ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. త్వరలోనే విజయవాడలో మరో షోరూంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం వోల్వో అమ్మకాల్లో ఒక్క హైదరాబాద్ వాటా సుమారు 20 శాతంగా ఉండటంతో వి-40 కారు విడుదలను ఇక్కడ విడుదల చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.