రొమ్ముక్యాన్సర్ కౌన్సెలింగ్
రొమ్ము క్యాన్సర్కు తప్పనిసరిగా రొమ్ము తొలగించాల్సిందేనా? రొమ్ము తొలగించకుండా చేసే ప్రక్రియ ఏదీ లేదా?
- ధరణి, వరంగల్
రొమ్ము క్యాన్సర్ తొలి దశలో ఉన్నవారికి రొమ్మును తొలగించే మాసెక్టమీ అనే శస్త్రచికిత్సను తప్పక చేయాల్సిందే అనే నియమమేదీ లేదు. రొమ్మును తొలగించకుండానే చేసే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ (బీసీఎస్) చేస్తున్నారు. దీంట్లో రొమ్ములోని హానికరమైన క్యాన్సర్ గడ్డను మాత్రమే తొలగించి, ఆంకోప్లాస్టిక్ టెక్నిక్ (ఇదోరకం ప్లాస్టిక్ సర్జరీ) సహాయంతో రొమ్మును మునపటిలాగే కాపాడుతు న్నారు. కాబట్టి రొమ్ము తొలగించుకోవాల్సి వస్తుందే మోననే కాస్మటిక్ సంబంధిత భయాలు అక్కర్లేదు. మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు.
నేను రొమ్ముక్యాన్సర్కు సర్జరీ చేయించుకున్నాను. కానీ నాకు సర్జరీ అన్నా కీమోథెరపీ అన్నా భయంగా ఉంది. అవేవీ లేకుండా మందులతో నా జబ్బు తగ్గే అవకాశం లేదా?
- సుధ, చెన్నై
చాలా రకాల క్యాన్సర్లకు కేవలం ఒకే చికిత్స ప్రక్రియ కాకుండా అనేక రకాల చికిత్స ప్రక్రియలను (మల్టీ మోడాలిటీ థెరపీ) అనుసరించాల్సి ఉంటుంది. అంటే సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రకమైన చికిత్స ప్రక్రియ అనుసరించాలన్నది రొమ్ము క్యాన్సర్ ఏ దశలో ఉందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీ చికిత్స సాధారణంగా రొమ్ముక్యాన్సర్ తొలిదశలో ఉన్నవారికి ఇస్తుంటారు. మరీ చిన్న వయసువారికీ, మరీ వయసు పైబడిన వారికి ఇది ఇవ్వరు. ఇక రేడియేషన్ థెరపీ అనేది ‘నోడ్ పాజిటివ్ డిసీజ్’ ఉన్నవారికి ఇస్తారు.
డాక్టర్ వి.హేమంత్
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్