సీసీ కెమెరాలో ముసుగు దొంగ
=పోలీసులకు లభించిన ఒకే ఒక్క క్లూ
=కొలిక్కి వస్తున్న బ్యాంకు దోపిడీ కేసు
=రంగంలోకి సీఐడీ అధికారులు.. సీసీ కెమెరా ఫుటేజీ స్వాధీనం
= పోయింది 15 కేజీల బంగారం.. 300 మంది వినియోగదారులది
సాక్షి, సిటీబ్యూరో: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు దోపిడీ కేసు కొలిక్కి వస్తోంది. కేసు మిస్టరీని ఛేదించేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం ఉదయం సీఐడీ అదనపు ఎస్పీ పాపయ్య, అల్వాల్ ఏసీపీ ప్రకాష్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి బ్యాంకు అధికారులను మరోమారు ప్రశ్నించి వివరాలు తీసుకున్నారు.
బ్యాంకులోని సీసీ కెమెరా బంధించిన అగంతకుడి పుటేజీని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో బ్యాంకు షెట్టర్ లేపి, ముఖానికి ముసుగు వేసుకున్న అగంతకుడు బ్యాగ్ పట్టుకుని లోనికి ప్రవేశించిన దృశ్యం నమోదైంది. అతడు లోనికి వచ్చిన వేంటనే సీసీ కెమెరాల ఫ్లగ్ ఊడదీసి అవి పనిచేయకుండా చేశాడు. దీంతో కెమెరా అగంతకుడి కదలికలను కేవలం 30 సెకన్ల పాటు మాత్రమే నమోదు చేసింది. అయితే, వాచ్మెన్ ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు.
బ్యాంకు సిబ్బంది హస్తం లేకుండా ఈ చోరీ జరిగేందుకు ఆస్కారం లేనందున ముసుగు వ్యక్తి ఎవరనేది తేలాల్సి ఉంది. వాచ్మెన్ రాములు ముఖానికి ముసుగు వేసి చేతిలో బ్యాగ్ పెట్టి పోలీసులు సీసీ కెమెరాలో చిత్రించారు. దోపిడీ జరిగిన రోజున అగంతకుడి దృశ్యాలు, పోలీసులు తీసిన దృశ్యాలతో పోల్చి చూస్తున్నారు. మరోపక్క కుషాయిగూడ పరిధిలో మారు తాళం చెవులు తయారు చేసే ముగ్గురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారు. చోరీకి పాల్పడింది కొత్తవారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులో కుదువబెట్టిన సుమారు 300 మంది వినియోగదారులకు చెందిన 15 కిలోల బంగారం చోరీకి గురైందని బ్యాంకు అధికారులు నిర్ధారించారు. డీవీఆర్ సహాయంతో పుటేజీలోని అగంతకుడిని మరింత స్పష్టంగా గుర్తించేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఆందోళన వద్దు: జనరల్ మేనేజర్ శర్మ
ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వారి వ్యక్తిగత లాకర్లు, బ్యాంకుకు చెందిన నగదు సురక్షితంగానే ఉందని మహే ష్ బ్యాంకు జనరల్ మేనేజర్ వి.ఎస్.శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు యథాతథంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
బ్యాంకు అధికారులపై కేసు
బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వల్లే తాను కుదవ పెట్టిన బంగారం చోరీకి గురైందని అరోపిస్తూ సైనిక్‌పురికి చెందిన వ్యాపారి ఎస్.వెంకట నాగమహేశ్ శనివారం రాత్రి కుషాయిగూడ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మహేశ్ బ్యాంకు అధికారులపై 420, 406 కింద కేసులు నమోదు చేశారు.