పొత్తుల చౌరస్తాలో సీపీఐ!
ఎటుపోవాలో తేల్చుకోలేని గందరగోళంలో వామపక్ష పార్టీ
సాక్షి, హైదరాబాద్: సీపీఐ పొత్తుల చౌరస్తాలో నిలిచింది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో.. ఏ ప్రాంతంలో ఏయే పార్టీలతో కలిసి ముందుకెళ్లాలనే విషయంలో గందరగోళంలో పడింది. దాంతో విభజనపై స్పష్టత వచ్చేంతవరకు వేచి చూడడమే ఉత్తమమని తలచి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్ నేత వి.సీతారామయ్య అధ్యక్షతన సోమవారం పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికలు, పొత్తులు, పార్టీ భవిష్యత్ కార్యక్రమం ఎజెండాగా జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించారు. ఎన్నికలు, సర్దుబాట్లపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పార్టీ పరిస్థితి బాగా దిగజారిందని అభిప్రాయానికొచ్చింది. సీమాంధ్రలో వైఎస్సార్సీపీతో పొత్తు విషయాన్ని పరిశీలించాలని కొన్ని జిల్లాల నేతలు సూచించినప్పటికీ విభజన బిల్లు పార్లమెంటులో పాసయ్యే వరకు వేచి చూద్దామని అభిప్రాయపడింది.
టీడీపీతో పొత్తుకు అవకాశాలు లేనట్టేనని తేల్చింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆ ప్రాంతంలో పార్టీ స్వతంత్రంగా పోటీ చేయగలిగే పరిస్థితి రాలేదన్న నిర్ణయానికి వచ్చింది. అక్కడ పొత్తులు తప్పవని, అయితే, కలిసొచ్చే పార్టీలు, శక్తులేమిటనే దానిపై తర్జనభర్జన పడింది. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనమయితే పరిస్థితి ఏంటి? కాకుంటే ఏమిటనే దానిపై కూడా చర్చ జరిపింది. రాష్ట్ర విభజన జరిగితే కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంటుందని, స్థానిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో సర్దుబాటుకు పోవాలనుకుంటే, ఆ మేరకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ శాఖకు ఉండాలని కొందరు వాదించినట్టు తెలిసింది. కాంగ్రెసేతర, బీజేపీయేతర శక్తుల ఏకీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకనుగుణంగా మొదట వామపక్ష పార్టీల ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. సమావేశం నిర్ణయాలు..
నీటి ప్రాజెక్టులు, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై పోరాటానికి పిలుపు
ఈనెల 17, 19 తేదీల మధ్య ఎంపిక చేసిన జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల దిగ్బంధం
మున్సిపల్ సిబ్బంది సమ్మెకు మద్దతు. కాంట్రాక్ కార్మికుల కనీస వేతనాలను రూ.12,500లకు పెంచాలని డిమాండ్
గ్రూప్-1, 2 ఉద్యోగాలను నోటిఫై చేసే విధంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
ప్రైవేటు బస్ ఆపరేటర్ల ఆగడాలను అరికట్టాలి. పాలెం దుర్ఘటన బాధితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్
విభజనపై అవకాశవాద వైఖరి
‘రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు అత్యంత అవకాశవాద వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. విభజన చివరి దశలో బీజేపీ కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి దుర్ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి’
-నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి