పోలీస్ శాఖలో 14 వేల పోస్టులు ఖాళీ
అమలాపురం టౌన్ : రాష్ట్ర పోలీసు శాఖలో 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజనానంతరం పోలీసు శాఖకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. పోలీసు శిక్షణ కేంద్రాలు హైదరాబాద్లోనే ఉండడంతో పోలీసు శిక్షణ, రిక్రూట్మెంట్కు సాంకేతికపరమైన అవరోధాలు తలెత్తుతున్నాయని తెలిపారు. అందువల్లనే పోస్టుల భర్తీ త్వరితగతిన జరగడం లేదన్నారు. ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
తొలి విడతగా 4 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి కొత్తగా పోలీసు శిక్షణ కేంద్రాలు, వివిధ సదుపాయాలకు సంబంధించిన భవనాలు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రంలో హోం గార్డు పోస్టులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాముడు తెలిపారు. అంతకుముందు మంత్రి చినరాజప్ప, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్లో రూ.22 లక్షలతో నిర్మించిన రిసెప్షన్ కౌంటర్ భవనాన్ని రాజప్పతో కలిసి డీజీపీ ప్రారంభించారు. ఏలూరు రేంజ్ డీఐజీ హరికుమార్, నార్త్ కోస్టల్ ఐజీ విశ్వజిత్, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.