ఆరోపణలు వస్తే ‘వీఆరే’ గతి!.
తాండూరు: విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆరోపణలు వచ్చినా ‘వీఆర్’ (వేకెన్సీ రిజర్వ్డ్)కు పంపిస్తానని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా గురువారం తాండూరు అర్బన్ సీఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు సరిగా పని చేయకపోయినా, వారిపై ఆరోపణలు వచ్చినా సహించేది లేదని, వీఆర్‌కు పంపిస్తానని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో ఎస్ఐల బదిలీలపై ఆలోచన చేస్తామన్నారు. మట్కా బెట్టింగ్‌లు కట్టినా, నిర్వహించిన వారిపైనా రౌడీషిట్ ఓపెన్ చేస్తామన్నారు. మట్కా జూదాన్ని పూర్తిగా నిషేధిస్తామన్నారు. మట్కా, ఇసుక అక్రమ రవాణా తదితర అక్రమ కార్యకలాపాలన్నిటి కి చెక్ పెడతామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే లెసైన్స్‌దారులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. జనవాసాల మధ్య పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతానన్నారు.
లెసైన్స్‌దారులు నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా అని స్థానిక డీఎస్పీలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారన్నారు. వికారాబాద్, తాండూరు తదితర ప్రాంతాల్లోని రీ క్రియేషన్ క్లబ్ కార్యకలాపాలపై త్వరలోనే సమీక్షించిన అనంతరం అనుమతించాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో హైవే పెట్రోలింగ్‌కు వాహనం ఉన్నా ఉపయోగించడం లేదన్నారు. త్వరలోనే హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
పెండింగ్ ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ)లను నిత్యం ప్రతి పోలీసుస్టేషన్లో కనీసం ఒక్కటైనా క్లియర్ చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జిల్లాకు కొత్తగా పది మంది మహిళా కానిస్టేబుళ్లు వచ్చారని, అవసరమైన పోలీస్స్టేషన్లలో వారికి పోస్టింగ్ ఇస్తామని ఆయన వివరించారు. తాండూరులో మహిళా, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు, వికారాబాద్‌లో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఎస్పీ ఈసందర్భంగా చెప్పారు. అంతకుముందు ఎస్పీ తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐలు నాగార్జున, అభినవ చతుర్వేదిలతో కేసుల పురోగతిపై ఆయన సమీక్షించారు.