ఓహయోలో రాళ్లవాన
వాన అంటే నింగి నుంచి నేలపైకి నీటిచినుకులు రాలిపడటమే కాదు, ఒక్కోసారి వడగళ్లు, అరుదుగా చేపలు, పీతలు వంటివి రాలిపడే ఉదంతాలూ ఉంటాయి. ఆకాశం నుంచి పిల్లులూ కుక్కలూ రాలిపడవు గానీ, ఇంగ్లిష్లో మాత్రం భారీ వర్షాన్ని ‘రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్’ అని అభివర్ణిస్తారు. అదో నుడికారం. పురాణాల్లో రాళ్ల వానల గురించిన వర్ణనలు మనకు తెలిసినవే. ఇంద్రుడికి కోపం వచ్చి రాళ్ల వాన కురిపిస్తే, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలిపై పెకైత్తి, నందుడి పరివారాన్నంతా కాపాడిన ఉదంతాన్ని భాగవతంలో వర్ణించారు.
అయితే, అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో హ్యారిసన్విల్లె అనే పట్టణంలో 1901 అక్టోబర్ 13న నిజంగానే రాళ్లవాన మొదలైందట. అప్పట్లో ఒక స్థానిక పత్రిక ఈ విషయమై విపులంగా ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఉన్నట్లుండి పైనుంచి రాళ్లు పడుతుండటంతో జనాలు భయభ్రాంతులయ్యారు. ఎవరైనా ఆకతాయిలు రాళ్లు విసురుతున్నారేమోనని అనుమానించారు. కొన్నాళ్లకు ఈ రాళ్లవాన దానంతట అదే ఆగిపోయింది. అయితే, దీనికి కారణాలు మాత్రం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఇది జరిగిన కొన్నేళ్లకు 1928లో ఇండోనేసియాలోనూ ఇలాంటి రాళ్లవానే కురిసింది.
- కూర్పు: పన్యాల జగన్నాథదాసు